ఇంట్లో పని చేయాలని వీసీ బెదిరిస్తుండు

ఇంట్లో పని చేయాలని వీసీ బెదిరిస్తుండు
  • వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఉద్యోగుల ఆందోళన

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్​ కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ వీసీ నందకుమార్​ తమను వేధిస్తున్నాడని మంగళవారం ఔట్​ సోర్సింగ్​ కార్మికులు యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. తన ఇంట్లో పని చేస్తేనే ఉద్యోగం ఉంటుందని, అప్పటి వరకు జీతం ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోయారు. బాధితులు మాదాసి స్వరూప, బొక్క గణేశ్​ మాట్లాడుతూ 2021 నుంచి యూనివర్సిటీలో ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో పని చేస్తున్నామని తెలిపారు. 

జూన్​లో ఐదుగురిని అకారణంగా విధుల నుంచి తొలగించారని, హైదరాబాద్​లో తన ఇంటి వద్ద పని చేయాలని వీసీ బెదిరిస్తున్నాడని చెప్పారు. తమకు న్యాయం జరగకపోతే యూనివర్శిటీ బిల్డింగ్​ పై నుంచి దూకి చనిపోతామన్నారు. ఇంట్లో చిన్న పిల్లలను వదిలి హైదరాబాద్​కు వెళ్లి పని చేయలేమని చెప్పారు.

మా ఇంట్లో పనిచేస్తే తప్పేంటి?

గతంలో వరంగల్​కు చెందిన వీసీ ఉన్నప్పుడు ఆయన ఇంటి వద్ద ఈ ఉద్యోగులే పని చేశారని, తాను హైదరాబాద్​కు చెందిన వాడిని కావడంతో ఉద్యోగులు అక్కడికి రావాల్సి ఉంటుందని వీసీ నందకుమార్  తెలిపారు. ఈ విషయం ఔట్​ సోర్సింగ్​ ఏజన్సీకి చెప్పామన్నారు. ఉద్యోగులు తన ఇంట్లో పని చేస్తే తప్పేం లేదన్నారు. ఉద్యోగులను అవసరం ఉన్న చోట వాడుకుంటామని, హైదరాబాద్​కు వచ్చిన ఉద్యోగులకు జీతాలు పెంచుతామని తెలిపారు.