సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖ కవి, పాటల రచయిత జయరాజ్ కు కాళోజీ నారాయణరావు అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 2023 సంవత్సరానికిగాను కాళోజీ నారాయణరావు అవార్డుకు జయరాజ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ అవార్డును అందజేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికతో జయరాజ్‌ను సత్కరించనున్నారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్.. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్ష లేని సమసమాజం కోసం కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో గ్రామ గ్రామాన తన ఆట, పాటలతో ప్రజను చైతన్యం చేశారు. ప్రకృతి గొప్పదనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు జయరాజ్.
