
కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, ప్రభుత్వ సలహాదారులు కె. వి రమణ చారి. ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కవి, రచయిత సుధాలా అశోక్ తేజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ పాల్గొన్నారు. ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందజేసింది. కాళోజీ అవార్డును అందుకున్న హరగోపాల్ ను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.
2001లో కాళోజీని కలిసిన..
ప్రజా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఆణిముత్యమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 2001లో కాళోజీ నారాయణరావును కలిసినట్లు చెప్పారు. కాళోజీ పెద్ద కవి అని...తెలంగాణ భాషలో ఎన్నో కవితలు రాసారని గుర్తు చేశారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. కర్ణాటకలో పుట్టి.. తెలంగాణలో పెరిగి మన భాష కోసం కృషి చేశారని తెలిపారు.
తెలంగాణకు పేరు తెచ్చిన వారిని గౌరవించుకుంటున్నాం
తెలంగాణ ఏర్పడిన తరువాత ఎంతో మంది మహనీయుల పేరు మీద అవార్డులు అందజేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. కాళోజీ అవార్డుకు సరైన వ్యక్తికి హర గోపాల్ అన్నారు. తెలంగాణకు పేరు తెచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించుకొంటున్నామని చెప్పారు. గతంలో పరిపాలన అస్తవ్యస్థంగా ఉండేదని..కానీ..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరికి దేని మీద పట్టుందో వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖను అప్పగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పచ్చగా కనిపిస్తోందన్నారు.
తెలంగాణ ఆస్తిత్వం కాళోజీ..
కాళోజీ నారాయణరావు తెలంగాణ అస్తిత్వం అని ఎమ్మెల్సీ గొరటి వెంకన్న అన్నారు. తెలంగాణ అంటే మన భాష..మన యాస అని చెప్పారు. తెలంగాణాలో నాయకుడంటే కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ వచ్చాక మనోళ్లను గుర్తుచేసుకుంటూ..అవార్డులు అందజేస్తున్నామని చెప్పారు.
అవార్డు అందుకోవడం సంతోషం..
కాళోజీ నేర్పిన పాఠాలతో ముందుకు వెళ్తున్నానని కాళోజీ అవార్డు గ్రహీత హరగోపాల్ అన్నారు. కాళోజీ ప్రజల తోటి ఉండమన్నారని చెప్పారు. బడి పలుకుల భాష కాదు..పలుకుబడుల భాష కావాలి అని కాళోజీ అన్నారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడు కాళోజీ అవార్డును పెద్దల సమక్షంలో అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.