‘‘ప్రతి సంవత్సరం కాళోజీ ఫౌండేషన్ నుంచి ఇస్తున్న కాళోజీ స్మారక పురస్కారం ఈ సంవత్సరం మీకు ప్రదానం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఒప్పుకోవాలి రాజేందర్” అన్నారు అంపశయ్య నవీన్. ఆయనతో నా పరిచయం సుదీర్ఘమైనది. నేను కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నవీన్‌తో పరిచయం ఉంది. ఆయన కథలు, ‘లైఫ్ ఇన్ ఏ కాలేజీ’.. అంపశయ్య, సౌజన్య లాంటి నవలలు అప్పుడే చదివాను. అవార్డు తీసుకోవాలని చెప్పింది అంపశయ్య నవీన్. ఇచ్చేది కాళోజీ మిత్రమండలి ఎట్లా కాదనగలను.
నవీన్ మాటలతో కాళోజీ గారి జ్ఞాపకాలు నాలో ముసురుకున్నాయి. 1976 ప్రాంతంలో కాళోజీ ‘నా గొడవ’ చదివాను. 1970 ప్రాంతంలో చొప్పకట్ల చంద్రమౌళి గారి ‘సమతా దీపాలు’ కవితా సంపుటిని కాళోజీ మా వేములవాడలో ఆవిష్కరించారు. అప్పుడు నేను హైస్కూల్ విద్యార్థిని. సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడుతున్న సమయం. 1979వ సంవత్సరంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు చనిపోయారు. అప్పుడు చాలా తక్కువ నిడివిలో జయప్రకాశ్ నాయయణ గారి గురించి ‘ఆంధ్రజ్యోతి’ వార పత్రికలో కాళోజీ రాసిన కవిత ప్రచురితమైంది. కవితా శీర్షిక ‘జేపీ’. ఆ కవిత ఇలా ఉంటుంది.
నేను హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నప్పుడు మా రూమ్మేట్ నందిగాం కృష్ణారావు ఇంట్లో కాళోజీ గారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అప్పుడు నా అడ్రస్ అడిగారు. ఇచ్చాను. మేం అప్పుడు మారేడ్‌పల్లిలోని జడ్జెస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాం. ‘కన్నాభిరాన్ దగ్గరికి వస్తుంటాను. అప్పుడు నీ దగ్గరికి వస్తాను’ అన్నారు. ‘అంతకన్నా మహాద్భాగ్యం ఏం ఉంటుంది’ అన్నాను. మారేడ్‌పల్లి వైపు వచ్చినప్పుడు కాళోజీ మా క్వార్టర్స్‌కి వచ్చేవారు. వచ్చిన ప్రతిసారి జడ్జెస్ క్వార్టర్స్‌లో ఉంటున్న న్యాయమూర్తులకి ఆశ్చర్యం, ఆనందం. తెల్లటి దుస్తుల్లో పొడుగాటి మనిషి, తెలుపు గడ్డంతో వస్తూ ఉంటే అందరి దృష్టి ఆయన వైపు.. ఆ తర్వాత నా వైపు. యం.ఇ.ఎన్. పాత్రుడు అప్పుడు హైదరాబాద్‌లో మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేసేవారు.
ఆయన ‘‘కాళోజీ గారు వచ్చినప్పుడు నాకు చెప్పండి. నేను వచ్చి కలుస్తా” అన్నారు. అట్లాగే చెప్పాను. ఒకసారి మా క్వార్టర్స్‌కి వచ్చి కాళోజీ గారితో ఓ గంట మాట్లాడి వెళ్లారు. మా క్వార్టర్స్‌కి ఎదురుగా న్యాయమూర్తి దాశరథి గారు ఉండేవారు. ఆయన అప్పుడు ఏసీబీ కోర్డు జడ్జిగా పనిచేసేవారు. ఓసారి కాళోజీ గారు వచ్చిన సంగతి గమనించి ఆయన కాళోజీకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తరువాత ఓ గంట మాట్లాడి వెళ్లారు. న్యాయమూర్తులతో కాళోజీ గారు ఎక్కువగా పతనమైపోతున్న విలువలు, హరించిపోతున్న మానవ హక్కులు, పౌర హక్కుల గురించి మాట్లాడేవారు. వాటిని కాపాడటానికి న్యాయమూర్తులు ఏం చెయ్యాలో చెప్పేవారు. ‘మీకు ఎక్కువగా పరిచయం లేదు కదా! అది మొదటి పరిచయం కదా! ఎందుకు సాష్టాంగ నమస్కారం చేశార’ని ఆ తర్వాత న్యాయమూర్తి దాశరథి గారిని అడిగాను. ‘గొప్పవాళ్ల పాదాలు తాకితే కొంత మేలు జరుగుతుంది. అది నా విశ్వాసం. నువ్వు గొప్ప అదృష్టవంతుడివి ఆయన నీ దగ్గరికి వస్తున్నారు’ అన్నారు.
ఆగస్టు 15వ తేదీ.. జెండా వందనం అయిపోయింది. పిల్లలూ, నేనూ అందరం ఇంట్లోనే ఉన్నాం. పన్నెండు గంటల ప్రాంతంలో కాళోజీ గారు వచ్చారు. వస్తూనే ‘ఏమన్నా ఉన్నాదే తినడానికి శైలజా!’ అంటూ కిచెన్ దగ్గరికి వచ్చారు. ఓ ఐదు నిమిషాల్లో చేస్తాను. మీరు కూర్చోండి అని చెప్పింది శైలజ. మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఐదు సంవత్సరాలు ఉన్న మా అబ్బాయి అనురాగ్ వచ్చి కాళోజీ గారి ఒళ్లో కూర్చున్నాడు. ఆయన తెల్లటి గడ్డాన్ని తన చేతులతో ముడివేస్తూ.. దారంతో ఉన్న ఆయన కళ్లద్దాలతో ఆడుతున్నాడు. అప్పుడే అటువైపు వచ్చిన శైలజ వాడిని మందలించింది. మా ఆవిడవైపు చూస్తూ ‘ఈ గడ్డంతో, కళ్లద్దాలతో వాడు ఆడకపోతే ఎవరు ఆడతారే శైలజా! నువ్వు ఆడతావా! రాజేందర్ ఆడతాడా!” అన్నారు కాళోజీ. ఆయన మాటలతో అందరం నవ్వుకున్నాం. ఈ ముచ్చట్లన్నీ 90–92 ప్రాంతంలోనివి. ఆ తర్వాత నాకు తిరుపతి బదిలీ కావడంతో మేం కలవడంలో గ్యాప్ వచ్చింది.
కోర్టు వాతావరణం గురించి, ఖాకీ స్థావరాల గురించి రాసిన కవితా సంపుటి ‘హాజిర్ హై’ ప్రచురిద్దాం అనుకున్నా. కాళోజీ గారైతే కవిత్వం, కోర్టులు, సమాజం తెలిసిన మహానుభావుడు. ఆయనతో ముందుమాట రాయిస్తే బాగుంటుంది అనుకుని ఫోన్ చేసి మాట్లాడా. చిత్తు ప్రతి పంపమని చెప్పారు. పంపించాను. ఓ వారం రోజుల తర్వాత ‘ముందుమాట సిద్ధంగా ఉంది. పోస్ట్‌లో పంపించనా’ అని ఫోన్ చేశారు. ‘వద్దు నేనే వచ్చి తీసుకుంటాన’ని చెప్పా. అట్లాగే ఒకరోజు హనుమకొండకి వెళ్లి ముందుమాట తీసుకుని ఓ గంట ఆయనతో మాట్లాడి వచ్చా. కాళోజీ డిక్టేట్ చేస్తే నాగిళ్ల రామశాస్త్రి ముందుమాట రాశారు. ఆ తర్వాత కాళోజీ సంతకం చేసి ఇచ్చారు. అందులో ఒక చోట అంటారు ‘‘హాజిర్ హై” రచనలో జింబో మన సమాజ నిజస్వరూపం. అవస్థపడుతున్న జన సామాన్యం.. న్యాయస్థానాలు కూడా చట్టాలు, చట్టాలు అమలు చేసే విధానానికి లోబడి ఏమీ చేయలేని అసహాయస్థితిని కండ్లకు కట్టినట్టు కవిత్వీకరించాడు జింబో”.
‘హాజర్ హై’ జింబో సృష్టి. అందులోని ఒక కవిత్వ నాటకం రంగస్థలం.. ‘ఆ గది’ (కోర్ట్) దాని అవస్థ’ అని చెప్తూ కాళోజీ ‘విషాద పూరితమైన, భీభత్సమైన హాజిర్‌హై అను నాటకం దానిలో సందర్శితమైన దృశ్యాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. సమాజం నిజస్వరూపం, తెలిసి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే ప్రయత్నం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాన’ని అన్నారు. ఈ ముందుమాట 1996 డిసెంబర్ 8 నాడు రాశారు.
ముందుమాటలో చెప్పని విషయాలని పొట్లపల్లి శ్రీనివాసరావు ప్రస్తావించారు. హాజిర్ హై కవితలని మిత్రమండలిలో కాళోజీ సోదరులు చదివించుకున్నారని, ఇంత ధైర్యంగా ఎవడున్నాడని కాళోజీ సోదరులు అన్నారని పొట్లపల్లి చెప్పారు.
కాళోజీ గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఫోన్‌లో పలకరించాను. కానీ.. ప్రత్యేకంగా కలవలేకపోయాను. 2001వ సంవత్సరంలో కాళోజీ గారి 88వ జన్మదినం హైదరాబాద్‌లో భారీ ఎత్తున జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి ప్రముఖులు హాజరైన ఈ సమావేశానికి నేనూ, శైలజా హాజరై కాళోజీ గారిని కలిశాం. ‘హైదరాబాద్‌లోనే ఉన్నాం. అప్పుడప్పుడు రండి’ అని శైలజ అంటే.. ‘‘ఇప్పుడు చాతకావడం లేదు. ఎవరైనా తీసుకొని వస్తే తప్ప రాలేని పరిస్థితి” అన్నారు. అప్పుడు మా ముగ్గురినీ కలిపి తీసిన ఫొటో ఓ మధురమైన జ్జాపకంగా మిగిలిపోయింది.
‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’’
ఈ కవితను శీర్షికతోపాటు చదివితే అర్థమవుతుంది. శీర్షిక ప్రాధాన్యత గురించి, తక్కువ పదాలతో గొప్ప కవిత ఎలా రాయవచ్చో చెప్పడానికి ఈ కవితని ఉదహరిస్తూ.. ‘భారతి’ మాస పత్రికలో ఓ వ్యాసం రాశాను. అది కాళోజీ దృష్టికి కూడా వెళ్లిందని మిత్రులు చెప్పారు. ఆ తరువాత కాళోజీతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత ఆయన కూడా చెప్పారు. ఈ కవితకి శీర్షిక లేకపోతే.. అది కాళోజీ జీవితానికి పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా ప్రాచుర్యం పొందింది.
2002లో నేను కొత్తగూడెంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నా. 13.11.2002న కాళోజీ చనిపోయారని తెలిసింది. అప్పుడు నాకున్నది 1/2 క్యాజువల్ లీవ్. వేరే సెలవు పెట్టలేని పరిస్థితి. అందుకని ఉదయం కారులో వరంగల్ బయల్దేరి కాళోజీ గారిని దర్శించి, దండం పెట్టి తిరిగి 2 గంటల వరకు కోర్టుకి చేరుకున్నా.
‘ఆఖరి చూపు’ విలువ ఏమిటో గుర్తు చేసుకుంటూ ఆరోజు ఓ కవిత రాశాను.
సెంటిమెంటని కొట్టి పారెయ్యకు
చూపుల కవిత్వాన్ని,
మొదటిచూపు ఎంత అవసరమో
ఆఖరి చూపు అంతే
పుట్టిన పసిపాపని చూసే మొదటి చూపు ఎలాంటిదో
ఆఖరి చూపు అలాంటిదే!
అందులో ఎంత ప్రేమ ఉందో
ఇందులోనూ అంతే!
ఇంకా చెప్పాలంటే
అంతకన్నా ఎక్కువగా
ఇందులో
ప్రేమ ఉంది. ఆత్మీయత ఉంది. వేదన ఉంది.
అందుకే మొదటి చూపు ఎంత అవసరమో
ఆఖరి చూపూ అంతే.
ఆ రోజు అప్పటికప్పుడు ఈ కవిత రాశాను. తర్వాత ఆఖరి చూపు గురించి మూడు కథలు నా వేములవాడ కథల్లో రాశాను. ఇవన్నీ కాళోజీ అవార్డు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు యాదికొచ్చిన విషయాలు. అందరికీ కృతజ్ఞతలతో కాళోజీ స్మారక పురస్కారాన్ని స్వీకరించాను.
(మంగారి రాజేందర్ ఈ నెల 13న
కాళోజీ స్మారక పురస్కారాన్ని
అందుకున్న సందర్భంగా..)
- డా. మంగారి రాజేందర్,
కవి, రచయిత
