కల్వకుంట్ల ఫ్యామిలీ దేవుళ్లను కూడా మోసం చేసింది : రేవంత్ రెడ్డి

కల్వకుంట్ల ఫ్యామిలీ దేవుళ్లను కూడా మోసం చేసింది : రేవంత్ రెడ్డి

కొండగట్టు ఆలయానికి తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ నాయకుడు మేడిపల్లి సత్యం ఉన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోనే ప్రశస్థమైన దేవాలయం కొండగట్టు అని, అంజన్న ఆశీర్వాదం తీసుకొని 4 కోట్ల ప్రజలకు మేలు జరిగేలా కోరుకున్నానన్నారు. గుడిలో ఉన్న పూజారులు భక్తులను, కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రీ, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు. 

600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, కాపాడాలని కోరారు. గతంలో బస్సు ప్రమాదం జరిగి..70 మంది చనిపోయారన్న ఆయన.. బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా ఆర్థిక సాయం చేశారని, ప్రమాదం జరిగిన చోట ఒక గోడ మాత్రం కట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ ఆరోపించారు. తక్షణం రూ.500 కోట్లు విడుదల చేసి అభివృద్ధి మొదలు పెట్టాలని కోరారు. కొండగట్టు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం తమకు లేదన్న ఆయన... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.