కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష కోట్లు.. పది వేల ఎకరాలు దోచింది: రేవంత్ రెడ్డి

కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష కోట్లు.. పది వేల ఎకరాలు దోచింది: రేవంత్ రెడ్డి
  • పాలమూరును మోసం చేసినందుకే.. కేసీఆర్​పై పోటీకి దిగిన
  • ఉమ్మడి జిల్లాలో 25 లక్షల ఎకరాలకు సాగునీళ్లిస్తాం  
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాంగిరి చేస్తుండ్రు
  • కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చర్మం వలుస్తం
  • మహబూబ్​నగర్, దేవరకద్ర, నారాయణపేట, పటాన్ చెరు సభల్లో పీసీసీ చీఫ్

మహబూబ్ నగర్/నారాయణపేట/సంగారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ అధికార బలంతో భూ బకాసురుడిలా మారి తెలంగాణను దోచుకున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు గత పదేండ్లలో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, 10 వేల ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆదివారం మహబూబ్​నగర్, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, కార్నర్ మీటింగ్స్ లో, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా డెవలప్ అయ్యిందన్నారు. పటాన్​చెరులో ప్రభుత్వ, ప్రజల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్​రెడ్డికి ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్​గౌడ్​ను భారీ మెజార్టీతో గెలిపిచాలని  కోరారు. సీఎం కేసీఆర్ పాలమూరును మోసం చేసినందుకే కామారెడ్డిలో ఆయనపై పోటీకి దిగానని రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు గులాంగిరి చేస్తున్నారని.. పాలమూరుకు నిధులు తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు.  

ఆ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ వే

ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కోయిల్​సాగర్, భీమా, కల్వకర్తి, జూరాల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని రేవంత్ స్పష్టం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు కంప్లీట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ‘‘పాలమూరు ప్రాజెక్టులు, వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు పరాయి వాడికి పట్టవు. కేసీఆర్​కు మన ప్రాంతం మీద వివక్ష ఉంది. అందుకే మనమే అభివృద్ధి చేసుకుందాం” అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పాలమూరును చెరబట్టారని రేవంత్ మండిపడ్డారు. శ్యాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్​ను దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరైనా చేయి వేస్తే.. వారి చర్మం వలిచి కార్యకర్తలకు చెప్పులు కుట్టిస్తా’’ అని ఆయన హెచ్చరించారు. 

పేట ఎమ్మెల్యేకు చేతగాదు

నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేతకాని వ్యక్తి అని, ఆయనకు కేసీఆర్ తో మాట్లాడే దమ్ము లేకనే ఈ ప్రాంతం వెనకబడిందన్నారు. జాయమ్మ చెరువును నింపి సాగునీరు ఇవ్వాలని నారాయణపేట-–కొడంగల్​ ఎత్తిపోతల కోసం జీవో 69 తెచ్చి సర్వే కోసం నిధులు మంజూరు చేయిస్తే.. ఈ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డబ్బు ఉందనే మదంతో ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలను గౌరవించడని, అలాంటి ఉద్దెర జీతగాడు ఎమ్మెల్యేగా అవసరమా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారిన ఆయన కృష్ణా–-వికారాబాద్​ రైల్వే లైన్ ఎందుకు సాధించలేదని పశ్నించారు. జిల్లా మీదుగానే కృష్ణా నది పారుతుంటే ఇక్కడి రైతులకు ఎందుకు సాగునీరు ఇవ్వలేదో చెప్పాలన్నారు. జిల్లాగా ఏర్పిడినా నారాయణపేట ఇంకా చిత్తుకాగితంలానే ఉందన్నారు. జిల్లా ఆఫీసులు, మౌలిక వసతులు కూడా కల్పించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ మహబూబ్​నగర్, నారాయణపేట, దేవరకద్ర అసెంబ్లీ అభ్యర్థులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పర్ణికారెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్), కర్నాటక ఎమ్మెల్సీ తిప్పన్న, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి, లీడర్లు కుంభం శివకుమార్ రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, ఒబేదుల్లా కొత్వాల్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.