ఆధారాలు మాయం చేయడంలో కవిత దిట్ట

ఆధారాలు మాయం చేయడంలో కవిత దిట్ట

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాంలో ఆరోపణలు  ఎదుర్కొంటున్న కవిత, కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్ పాత్రపై కూడా ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ డిమాండ్ చేశారు. స్కాంలలో ఆధారాలను తారుమారు చేయడంలో కవిత దిట్ట అని ఆయన ఆరోపించారు. ‘‘ఆధారాలను కవిత మాయం చేయగలరు. చెట్ల సంతోష్ వాటిని చెట్ల కింద దాచగలరు. ఎమ్మెల్సీ పదవికి కవిత వెంటనే రాజీనామా చేసి, దర్యాప్తు సహకరించాలి. చివరికి తన బిడ్డ, కొడుకుపై ఆరోపణలు వచ్చినా క్షమించనని చెప్పిన కేసీఆర్  వెంటనే కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి” అని డిమాండ్​ చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మధు యాష్కీ  మీడియాతో మాట్లాడారు. 2014 లో కవిత ఆదాయం ఎంతని, ఇప్పుడు ఎంతకు పెరిగిందని ప్రశ్నించారు. మూడు బెడ్రూంల అపార్ట్ మెంట్​ నుంచి రూ. 300 కోట్ల విలువ చేసే భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. జన్నారంలో ఫాంహౌస్​, నిజామాబాద్, బెంగళూరులో వేల కోట్ల ఆస్తులు, ప్రైవేటు విమానాల్లో తిరిగే సౌకర్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. కేంద్ర విమానయాన శాఖను సంప్రదిస్తే... ప్రైవేట్ విమానాల్లో కవితతో పాటు ఎవరెవరు ప్రయాణించారో తెలుస్తుందన్నారు. సీబీఐ, ఈడీ వెంటనే దాడులు చేస్తే అన్ని ఆధారాలు బయటికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ కవిత, కేటీఆర్, హరీశ్​రావుకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘‘కవిత.. బతుకమ్మ అంటూ బతక నేర్చారు. తెలంగాణ ముసుగులో ప్రజల ఆకాంక్షలు అడ్డుపెట్టి కేటీఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చారు. ఒక మహిళగా లిక్కర్ దందాలు చేయడానికి సిగ్గువేయడం లేదా? కవితను చెల్లెలు అని పిలవడానికి సిగ్గనిపిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చనిపోయిన రైతులకు జాగృతి నుంచి రూ. 5 వేలు ఇస్తానని చెప్పిన కవిత.. జాగృతి నుంచి ఆ హామీనే తొలగించారు” అని ఆయన మండిపడ్డారు. ఎంతో మంది మగవాళ్లు మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, వాళ్ల కుటుంబాల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

రూ. 1,35,000 కోట్లకు చేరిన రాష్ట్ర లిక్కర్​ ఆదాయం 

‘‘తెలంగాణ ద్రోహులను చేర్చుకుని కేసీఆర్  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యువతను మత్తుకు బానిసలు చేసిన కేసీఆర్.. విశ్వ నగరాన్ని విష నగరంగా మార్చారు. 2014 లో రూ. 10 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర లిక్కర్ ఆదాయాన్ని ఎనిమిదేండ్లలో రూ. 1, 35, 000 కోట్లకు పెంచుకున్నారు” అని మధు యాష్కీ ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి వరదలు ప్రగతి భవన్ లోకి వచ్చాయన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని, మరి అలాంటప్పుడు ఎందుకు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబంపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయకపోతే... బీజేపీ, టీఆర్ఎస్, ఆప్  కుమ్మకైనట్లు ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు.