
కామారెడ్డి, వెలుగు: ఎన్నికల ఏర్పాట్లు, డ్యూటీలో నిర్లక్ష్యం, తప్పుల తడకగా ఓటర్ల జాబితా వంటి కారణాల వల్ల కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వార్డుల విభజన, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, సామాజిక వర్గాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాల విడుదల తదితర విధుల్లో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 10న విడుదల చేయాల్సిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా..12 న విడుదలైంది. జాబితాలో పేర్లు గల్లంతు కావటం, కులాలను కూడా మార్చేయడం వివాదస్పదమైంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. దీంతో కమిషనర్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఇన్ చార్జి కమిషనర్‌గా జడ్పీ డిప్యూటీ సీఈవో చందర్‌నాయక్‌ను, ఎన్నికల నోడల్ అధికారిగా ఏపీడీ సాయన్నను నియమించారు.