ఏడాదిలోగా ఆర్వోబీని పూర్తి చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

ఏడాదిలోగా ఆర్వోబీని  పూర్తి చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రూరల్ ​మండలం తీగలగుట్టపల్లి వద్ద రూ.154.74 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం  ఆర్వోబీ నిర్మాణ పనులకు స్టేట్​ ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్ బి.వినోద్ కుమార్ తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 30–-40 ఏళ్ల వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో ఆర్వోబీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ​బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆర్వోబీకి మంజూరైన రూ.126 కోట్లు కేంద్రం ఇచ్చినవి కావని, డీజిల్, పెట్రోల్‌పై వేసే సెస్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన సీఆర్ఐఎఫ్​  నుంచి ఇచ్చినవేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, జడ్పీ చైర్ పర్సన్ కె.విజయ, ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూపరాణిహరిశంకర్, లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, సుడా చైర్మన్ రామకృష్ణారావు పాల్గొన్నారు. 

పోటాపోటీగా నినాదాలు

 ఆర్వోబీ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తుండడంతో అదే ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, నితిన్​గడ్కరీ, ఎంపీ బండి సంజయ్ ఫొటోలకు బీజేపీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. భూమి పూజ అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు, పోటీగా  బీజేపీ క్యాడర్ ​నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో  పోలీసులు సముదాయించారు. అనంతరం బీజేపీ క్యాడర్​ శిలాఫలకం వద్దకు చేరుకుని  'సొమ్ము కేంద్రానిది.. సోకులు మీకా' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు, మంత్రికి, మాజీ ఎంపీకీ  దమ్ముంటే ఆర్వోబీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులపై వైట్ పేపర్ రిలీజ్​ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్ కృషి ఫలితంగానే ఆర్వోబీకి సెంట్రల్​ఫండ్స్ రిలీజ్​అయ్యాయని, ఆయన లేని టైంలో శంకుస్థాపన చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగేశ్వర్ రెడ్డి, లీడర్లు శ్రీనివాస్ గౌడ్, వాసుదేవ రెడ్డి, ప్రవీణ్ రావు పాల్గొన్నారు.