కమల్ కామెంట్లపై దుమారం...తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న నటుడు

కమల్ కామెంట్లపై దుమారం...తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న నటుడు
  • థగ్ లైఫ్​సినిమా ఆడియో ఫంక్షన్​లో వ్యాఖ్యలు
  • కమల్​పై మండిపడుతున్న కన్నడిగులు
  • కన్నడ భాష చరిత్ర ఆయనకు తెలియదంటూ సిద్ధరామయ్య ఫైర్
  • కమల్​ను రాజ్యసభకు నామినేట్ చేసిన డీఎంకే చీఫ్​ స్టాలిన్​
  • తీవ్రంగా మండిపడుతున్న కన్నడిగులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు
  • బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరులో నిరసనలు

బెంగళూరు: ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ తన తాజా సినిమా ‘థగ్ లైఫ్’ ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. శనివారం చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ..'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అని అన్నారు. 

ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నాటకలోని బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కన్నడ అనుకూల సంస్థలు నిరసనలు చేపట్టాయి. పలు చోట్ల నిరసనకారులు కమల్ హాసన్ పోస్టర్లను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నడ భాషకు వేల ఏండ్ల చరిత్ర ఉందని, కమల్ కామెంట్స్ కన్నడిగుల స్వాభిమానాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటించిన "థగ్ లైఫ్" ప్రదర్శనను కర్నాటకలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కమల్‌‌‌‌‌‌‌‌పై ఫిర్యాదు

కర్నాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి నేతృత్వంలో పలువురు బెంగళూరు ఆర్‌‌‌‌‌‌‌‌టీ నగర్ పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కమల్‌‌‌‌‌‌‌‌పై ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు కన్నడిగుల సెంటిమెంట్స్‌‌‌‌‌‌‌‌ను గాయపరిచాయని.. కన్నడ, -తమిళుల మధ్య విషబీజాలు నాటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమల్ హాసన్ కామెంట్లపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు మండిపడ్డారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. "కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌కు ఈ విషయం తెలియదనుకుంటా" అని ఎద్దేవా చేశారు. 

తప్పుగా అర్థం చేసుకున్నరు: కమల్

తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కమల్ హాసన్ అన్నారు. "ఆడియో ఫంక్షన్​లో మాట్లడిన మాటలు ప్రేమతో చెప్పినవి. కన్నడ భాష గొప్పతనాన్ని తగ్గించాలనేది నా ఉద్దేశం కాదు. ప్రేమతో చెప్పినదానికి నేను క్షమాపణ కోరను. భాషాల గురించి మాట్లాడటానికి నాతో సహా రాజకీయ నాయకులు ఎవరికీ అర్హతలేదు" అని కమల్ హాసన్​ స్పష్టంచేశారు. క్లిష్ట సమయాల్లో కర్నాటక తనకు అండగా నిలిచిందన్నారు.