- ఎన్నికల ఏర్పాట్లలో యంత్రాంగం బిజీ
- జిల్లాలో నోడల్ అధికారుల నియామకం
కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తును ముమ్మరం చేసింది. శనివారం ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా వర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కలు, కుల గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో రిజర్వు చేసిన వార్డులు పునరావృతం కాకుండా కొత్త స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించేలా ప్రక్రియ కొనసాగుతోంది. బీసీలకు సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల్లో 27 శాతం రిజర్వు చేసేలా లిస్టు రెడీ చేస్తున్నారు. ఆదివారం మహిళా సర్పంచ్ స్థానాలకు ఆర్డీవో కార్యాలయాల్లో, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో రాజకీయ నాయకుల సమక్షంలో డ్రా నిర్వహించి రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సాయంత్రం వరకల్లా తుది జాబితా కలెక్టర్‌కు చేరగానే, అక్కడి నుంచి పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించనున్నారు. ఆమోదం అనంతరం గెజిట్ జారీ చేస్తారు. ఆదివారం ఓటర్ల ఫైనల్ లిస్టును కూడా ప్రకటించనుండటంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలో యంత్రాంగం బీజీ అయ్యింది. ఇప్పటికే పల్లెల్లో పంచాయతీ పోరుపై చర్చలు ఊపందుకున్నాయి.
జిల్లాలో పంచాయతీలు
కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు, 5,222 వార్డులు ఉన్నాయి. కామారెడ్డిలో 532 పంచాయతీల్లో 65 గ్రామాలు వంద శాతం ఎస్టీ జనాభా ఉండడంతో ఎస్టీ రిజర్వ్ కానున్నాయి. గతంలో ఎస్సీలకు 79, ఎస్టీలకు 91 స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి.
పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలు, ఖర్చుల పర్యవేక్షణ, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్ బాక్సుల రవాణా, ట్రైనింగ్‌లు, ఫిర్యాదుల స్వీకరణ, మీడియా కమ్యూనికేషన్ తదితర విభాగాలకు జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
పంచాయతీ రిజర్వేషన్లపై పల్లెల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ ఊరు ఏ కేటగిరీకి రిజర్వ్అవుతుందోనన్న చర్చలు మొదలయ్యాయి. సర్పంచ్ బరిలో నిలవాలనుకుంటున్న లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు అనుకూలంగా రిజర్వేషన్వస్తుందా.. లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఆశావహులు అనుచరులతో కలిసి కుల సంఘాలు, యూత్సంఘాలతో భేటీలు నిర్వహిస్తూ వ్యూహాలు పన్నుతుండడం విశేషం.
