సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కామారెడ్డి జిల్లా వాసి

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కామారెడ్డి జిల్లా వాసి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విధ్వంసంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట వాసి మధుసూధన్ సూత్రధారిగా భావిస్తూ.. అతడిని A1గా చేర్చారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ గ్రూపులో పలు డిపెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టిట్లు అనుమానిస్తున్నారు. 

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ.. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు రెచ్చిపోయారు. రైల్వే బోగీలను, ఆస్తులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన యువకులు ఉన్నట్లు ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 1,500 నుంచి 2 వేల మంది పాల్గొన్నారని  రైల్వే ఎస్పీ అనురాధ పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న వారందరూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారేనని, వేరే రాష్ట్రాల వారెవరూ లేరన్నారు.