భూ తగదాలతో ఒకరి హత్య ..తండ్రీకొడుకుల అరెస్ట్.. కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలో ఘటన

భూ తగదాలతో ఒకరి హత్య  ..తండ్రీకొడుకుల అరెస్ట్.. కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలో ఘటన

కామారెడ్డి/కామారెడ్డిటౌన్,  వెలుగు: భూ తగదాలతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి డీఎస్సీ మధుసూదన్​ మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్​కు చెందిన బండారి రాజిరెడ్డి(55) మే 29 నుంచి కనిపించట్లేదని అతని కొడుకు రంజిత్​ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 భూ తగదాల నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన మందాల ఎల్లయ్య, అతని కొడుకు  ప్రణీత్​కుమార్​పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఎంక్వైరీ చేయగా, భూ తగదాలతో రాజిరెడ్డిని తండ్రి, కొడుకులు ఎల్లయ్య, ప్రణీత్​కుమార్​ హత్య చేసినట్లు తేలింది. ముందస్తు ఫ్లాన్​ ప్రకారం మే 29న రాజిరెడ్డికి ఫోన్​ చేసి ఎల్లయ్య పశువుల కొట్టం వద్దకు పిలిపించారు. అక్కడకు రాగానే ఎల్లయ్య, ప్రణీత్​కుమార్​ కలిసి ఇనుప రాడ్​తో దాడి చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.

 చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత డెడ్​బాడీని లింగాపూర్​ గ్రామ శివారులోని నీళ్లు లేని పాడుబడిన బావిలో గుంత తవ్వి పూడ్చి పెట్టారు. ఎల్లయ్య వద్ద రాజిరెడ్డి కొద్ది నెలల కింద 26 గుంటల భూమిని రూ.1.26 కోట్లకు కొనేందుకు అగ్రిమెంట్​ చేసుకొని రూ.28 లక్షలు అడ్వాన్స్​గా ఇచ్చాడు. ఈ డబ్బులను తాడ్వాయి మండలం ఎర్రపహాడ్​ శివారులో రాజిరెడ్డి  బంధువుల దగ్గర భూమి కొనాలని నిర్ణయించి అడ్వాన్స్​గా ఇచ్చారు. 

ఈక్రమంలో రాజిరెడ్డి మిగతా డబ్బులు ఇవ్వకపోగా, ఎర్రపహాడ్​లో భూమి రిజిస్ట్రేషన్​ కాకుండా అడ్డుతగులుతున్నాడని ఎల్లయ్య, అతని కొడుకు భావించారు. అమ్మిన  భూమికి మొత్తం డబ్బులు ఇవ్వకపోగా, తాము కొన్న భూమి రిజిస్ట్రేషన్​ కాకుండా అడ్డుతగులుతున్నాడనే ఉద్దేశంతో  హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు శ్రీధర్​ గౌడ్​, నరహరి, ఎస్సైలు రంజిత్, భువనేశ్వర్​ పాల్గొన్నారు.