కాంగ్రెస్లో బీసీ వర్సెస్ కమ్మ.. హైకమాండ్ కు అల్టిమేటం

కాంగ్రెస్లో బీసీ వర్సెస్ కమ్మ.. హైకమాండ్ కు అల్టిమేటం
  • 10 ఎమ్మెల్యే సీట్లు ఇయ్యాలంటున్న కమ్మ లీడర్లు
  • లేదంటే ప్లాన్​ బీ ఉందంటూ అల్టిమేటం
  • కమ్మ నేతలకు వెనువెంటనే హైకమాండ్​ అపాయింట్​మెంట్​
  • ఢిల్లీలో ఐదు రోజులున్నా బీసీలకు అపాయింట్​మెంట్​ దొరకలే
  • పైగా పలువురు బీసీ సీనియర్​ నేతలకు చీవాట్లు!
  • 0.5% లేని కమ్మవాళ్లకు 10 సీట్లా అని బీసీల ప్రశ్న
  • రాహుల్​ చెప్పినన్ని సీట్లు కూడా తమకు ఇస్తలేరని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీలో కులాల పంచాయితీ తీవ్రమవుతున్నది. ఇప్పటికే తమ వాటా సీట్లు ఇవ్వాల్సిందేనని బీసీలు, జనరల్​ సీట్లలోనూ వాటా కావాలంటూ ఎస్సీ, ఎస్టీలు డిమాండ్​ చేస్తుంటే.. ఇప్పుడు కమ్మ నేతలు కొత్త డిమాండ్​ను తెరపైకి తీసుకొచ్చారు. పైగా తాము కోరినన్ని సీట్లు ఇయ్యకుంటే తాడోపేడో తేల్చేసుకుంటామని హైకమాండ్​కు కమ్మ సామాజికవర్గం నేతలు అల్టిమేటం ఇచ్చారు.  శుక్రవారం రేణుకా చౌదరి నేతృత్వంలోని పలువురు ఆ వర్గపు నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో సమావేశమయ్యారు. 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తమకు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనిపై బీసీ లీడర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం జనాభా 0.5 శాతమేనని, అలాంటిది అన్ని సీట్లు అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు బీసీలకు అసలు ఓట్లే పడవంటూ కొందరు ఓసీ లీడర్లు సోషల్​ మీడియాలో ప్రచారానికి దిగుతున్నారు. 

ఇయ్యకుంటే ప్లాన్​ బీనట!

అడిగనన్ని సీట్లు ఇయ్యకుంటే తమ దగ్గర ప్లాన్​ బీ ఉన్నదంటూ పార్టీ సీనియర్​ నేత రేణుకా చౌదరి హైకమాండ్​కు అల్టిమేటం ఇచ్చేశారు. ఆ ప్లాన్​ బీ ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతున్నది. కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు మాత్రం రేణుకా చౌదరి వ్యాఖ్యలతో తమకేం సంబంధం లేదంటున్నారు. ప్లాన్​ బీ వ్యాఖ్యలు రేణుకా చౌదరి వ్యక్తిగతమని చెప్తున్నారు. 

వాళ్లకు అపాయింట్​మెంట్​.. వీళ్లకు చీవాట్లు

ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన కమ్మ సామాజిక వర్గం నేతలకు హైకమాండ్​ వెంటనే అపాయింట్​మెంట్​ ఇచ్చేసింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన వాళ్లకు.. ఆ రోజు మధ్యాహ్నమే కేసీ వేణుగోపాల్​ అపాయింట్​మెంట్​ ఇచ్చి మాట్లాడారు. అదే రోజు సాయంత్రం ఏఐసీసీ చీఫ్​ ఖర్గే కూడా వారిని కలిశారు. శనివారం స్క్రీనింగ్  కమిటీ చైర్మన్ మురళీధరన్​తోనూ భేటీ అయ్యారు. అయితే, బీసీ లీడర్లకు మాత్రం హైకమాండ్​ పెద్దల అపాయింట్​మెంట్​ దొరకలేదు. జనాభా ప్రకారం సీట్లివ్వాలని తొలుత డిమాండ్​ చేసిన బీసీ లీడర్లు.. ఇప్పుడు కనీసం రాహుల్​ ప్రకటించినన్ని సీట్లయినా ఇవ్వాలని కోరుతున్నారు. అవీ ఇచ్చే పరిస్థితి లేదని తేలడంతో విషయాన్ని హైకమాండ్​తోనే తేల్చుకునేందుకు ఇటీవల బీసీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. రాహుల్, ఖర్గేను కలిసి రిప్రెజెంటేషన్​ ఇచ్చేందుకు అపాయింట్​మెంట్​ కోరారు. దాదాపు 5 రోజులు అక్కడే ఉన్నారు. వారితో కేసీ వేణుగోపాల్​, మురళీధరన్​ భేటీ అయ్యారే తప్ప.. రాహుల్​, ఖర్గేను కలువలేకపోయారు. పైగా పలువురు సీనియర్​ నేతలను పట్టుకుని కేసీ వేణుగోపాల్​ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తమను ఐదు రోజులు వేచి ఉండేలా చేసి అపాయింట్​మెంట్​ ఇవ్వని హైకమాండ్​ నేతలు.. పెద్ద కుల నాయకులకు అడిగిన వెంటనే అపాయింట్​మెంట్​ ఎట్లిస్తరని కొందరు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పట్టించుకుంటలేరని బీసీల ఆవేదన

బీసీలకు 34 సీట్లిస్తామని రాహుల్​ గాంధీ మాటిచ్చినా.. రాష్ట్ర కాంగ్రెస్​ పెద్దలు మాత్రం అందుకు సిద్ధంగా లేరని కొందరు బీసీ నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. గెలుపు గుర్రాల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్​, ఖర్గే వైఖరికి భిన్నంగా ఫ్యూడల్​ వ్యవస్థ మాదిరిగా రాష్ట్రంలో ముందుకెళ్తే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. టికెట్ల విషయమై బీసీ లీడర్లు మరోసారి ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది.  

కమ్మ ఓటర్లు అంతలా ఎఫెక్ట్​ చూపిస్తరా?

కమ్మ సామాజికవర్గం నేతలు బాన్సువాడ, ఖమ్మం, పాలేరు, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, ఎల్బీనగర్​, జూబ్లీహిల్స్​, కుత్బుల్లాపూర్​, సిర్పూర్​ కాగజ్​నగర్​, మేడ్చల్​లో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని వాదిస్తున్నారు. ఎంత లెక్కేసుకున్నా రాష్ట్రంలో వాళ్ల జనాభా 0.5 శాతానికి మించి ఉండదని , అలాంటిది వారికి 10 సీట్లు ఎట్లిస్తారన్న పార్టీ సర్కిల్స్​లోనూ చర్చ నడుస్తున్నది.