హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఈఎన్సీగా కనకరత్నం నియమితులయ్యారు. బుధవారం సాయంత్రమే ఆయన ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్ సంజీవరావును వెంటనే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు.
2021 ఫిబ్రవరిలో సంజీవరావు రిటైర్ కాగా.. మూడేండ్లుగా రెగ్యులర్ అధికారులు ఉన్నా గత ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల రిఫరెన్స్ తో ఈఎన్సీగా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల నుంచి రిటైర్డ్ అధికారులను కొత్త ప్రభుత్వం తొలగిస్తుంది. సంజీవరావును ఎట్టకేలకు విధుల్లో నుంచి తొలగించటంపై పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
