
- 15 మంది మృతి.. 60 మందికి గాయాలు
- మృతుల్లో ముగ్గురు రైల్వే సిబ్బంది.. బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం
- రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన గూడ్స్ రైలు లోకో పైలెట్
- వెనుక నుంచి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఢీకొట్టడంతో గాల్లోకి లేచిన చివరి బోగీ
- అందులో లగేజీ మాత్రమే ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
కోల్‌కతా: బెంగాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నెమ్మదిగా కదులుతున్న ఎక్స్ ప్రెస్ రైలును గూడ్స్ బండి వెనక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో పదిహేను మంది చనిపోగా.. 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం ఉదయం డార్జిలింగ్ జిల్లాలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో ముగ్గురు రైల్వే సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ త్రిపురలోని అగర్తలా నుంచి కోల్‌కతాలోని సీల్దాకు బయల్దేరింది. న్యూజల్పాయ్గురి సమీపంలోని రంగపాణి స్టేషన్ వద్దకు రాగానే.. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణిస్తున్న ట్రాక్‌పైకి గూడ్స్ రైలు వచ్చింది. కాంచన్‌జంగా ట్రైన్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్ రైలు చివరి బోగీ గాల్లోకి లేచింది. గూడ్స్ ట్రైన్ బోగీలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంచన్‌జంగా ట్రైన్ కోచ్‌లు మూడు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చివర్లో పార్సిల్ కోచ్, తర్వాత గార్డ్ కోచ్ లు ఉన్నాయి. ఆ తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ ఉంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించలేదని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలను కలిపే మెయిన్ రూట్
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది స్పాట్‌కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. స్థానికుల సాయంతో ప్రయాణికులను బయటికి తీసి నార్త్బెంగాల్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో దెబ్బతిన్న బోగీలను రైల్వే అధికారులు విడదీసి.. మిగిలిన కంపార్ట్మెంట్లతో ట్రైన్ సీల్దాకు పంపించేశారు. కాగా, కాంచన్‌జంగా ట్రైన్.. బెంగాల్, నార్తీస్ట్ నగరాలైన సిల్చార్, అగర్తలాను కలుపుతూ ప్రతిరోజూ సేవలందిస్తుంటుంది. ఈ రూట్ చికెన్‌నెక్ కారిడార్‌లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే మెయిన్ రూట్.
ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు
కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువ మంది టూరిస్టులే ప్రయాణిస్తుంటారు. కోల్ కతా, పొరుగున ఉన్న సౌత్ బెంగాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రిలీఫ్ కోసం ఈ ట్రైన్లోనే పర్యాటకులు డార్జిలింగ్‌కు వెళ్తున్నారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైల్వే అధికారులు గువహటి, సీల్దాలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తున్నట్టు తెలిపింది.
తెల్లవారుజాము నుంచే పనిచేయని సిగ్నల్..!
సిగ్నల్‌లో తలెత్తిన సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. యాక్సిడెంట్ జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్, చట్టర్ హట్ జంక్షన్ మధ్య ఆటోమెటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయలేదని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ 8.27 నిమిషాలకు రంగపాణి స్టేషన్ నుంచి బయల్దేరింది. అయితే, ఆటోమేటిక్ సిగ్నల్ సమస్య కారణంగా రాణిపత్ర, చట్టర్ హట్ జంక్షన్ మధ్య ఆగిపోయింది. అదే టైమ్‌లో రంగపాణి స్టేషన్ నుంచి గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
కవచ్ సిస్టం ఉండుంటే..
సెల్దా కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్న గౌహతి–ఢిల్లీ రూట్ లో ‘కవచ్’ వ్యవస్థ లేదని రైల్వే బోర్డు చైర్ పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. ఆ రూట్ లో త్వరలోనే కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ తప్పిదమే కారణమై ఉండవచ్చని ఆమె చెప్పారు. సిగ్నల్ ను గూడ్స్ రైలు గుర్తించకుండా వెళ్లిపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చన్నారు.
షెడ్యూల్ డైరెక్షన్ రివర్సల్‌తో బతికిపోయారు
డైరెక్షన్ రివర్సల్ కారణంగా కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ వెనుక బోగీలో కూర్చున్న ప్రయాణికులు చనిపోగా.. ముందు బోగీలో ఉన్నవారు బతికిపోయారు. అస్సాంలోని లమ్డింగ్ స్టేషన్ లో ప్రొసీజర్ ప్రకారం కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ఇంజిన్‌ను వెనకకు తీసుకొచ్చి అమర్చారు. దీంతో ముందు బోగీలు వెనుక వైపు, వెనుక వైపు బోగీలు ముందుకు వచ్చాయి. ప్రమాదంలో వెనుక వైపు బోగీలో ఉన్న ప్రయాణికులు చనిపోయారు. ముందు బోగీలో ఉన్నవారు బతికిపోయారు.
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ విపత్కర సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతం అవ్వాలి’’ అని ట్వీట్లో ముర్ము ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘‘వెస్ట్ బెంగాల్లో జరిగిన యాక్సిడెంట్ దురదృష్టకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నాను. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది’’ అని మోదీ ట్వీట్ చేశారు.
యాక్సిడెంట్ వార్త విని షాక్‌కు గురైనట్లు బెంగాల్సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే డాక్టర్లు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ స్పాట్‌కు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశిస్తున్న’’ అని సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ‘యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాం. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిసి రెస్క్యూ చేస్తున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించాం’’అని చెప్పారు.