కంది రైతుల పంట పండింది.. క్వింటాల్ కు మద్దతు ధర రూ.7 వేలు

కంది రైతుల పంట పండింది.. క్వింటాల్ కు మద్దతు ధర రూ.7  వేలు
  • బహిరంగ మార్కెట్ లో రూ.10 వేలు
  • మార్క్ ఫెడ్  ఆధ్వర్యంలో  కమర్షియల్  కొనుగోళ్లకు సిద్ధం
  • రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో కంది రైతుల పంట పండుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక వైపు పత్తి ధర లేక రైతులు నష్టపోతుంటే.. మరో వైపు కంది పంట ధర పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా బహిరంగ మార్కెట్​లో  ఎక్కువ ధర ఉండడం.. దీనికి తోడు మార్క్ ఫెడ్  సైతం కమర్షియల్  కొనుగోళ్లకు సిద్ధం కావడంతో ఈ ఏడాది కంది రైతుల పంట పండినట్లైంది. ప్రైవేటు వ్యాపారులతో పోటాపోటీగా మార్క్ ఫెడ్  సంస్థ కందుల కొనుగోళ్లు చేపట్టనుంది. ప్రస్తుతం కందులకు క్వింటాల్  మద్దతు ధర రూ.7 వేలు ఉండగా బహిరంగ మార్కెట్​లో క్వింటాల్ రూ.10 వేలు పలుకుతోంది. ఈ క్రమంలో మార్క్ ఫెడ్   సంస్థ సైతం మొదటిసారిగా కమర్షియల్  కొనుగోలు చేపట్టనుంది. ఆదిలాబాద్ లో ఈనెల 20న కంది కొనుగోళ్లపై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మార్కెట్  యార్డుల్లో ఈనెల 21 నుంచి కొనుగోళ్లు జరపనున్నారు. ఇప్పటికే గన్నీ బ్యాగులు సైతం అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కంది పంట ఇప్పుడిప్పుడే చేతికిరాగా.. కొంతమంది రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్​లో విక్రయిస్తున్నారు.

50 వేల టన్నులు సేకరించేందుకు నిర్ణయం

కంది రైతులు తమ పంటను ఈసారి ప్రైవేట్, మార్క్ ఫెడ్​కు ఎవ్వరికి అమ్ముకున్నా లాభం పొందే అవకాశం ఉంది. నిరుడు మద్దతు ధర క్వింటాల్​కు రూ.6,600 ఉండగా ప్రైవేట్​లో రూ. 7 వేల వరకు విక్రయించారు. ఈ ఏడాది బహిరంగ మార్కెట్​లో ధర రూ.10 వేలకు పైగా ఉంది. అటు మార్క్ ఫెడ్  కూడా కొనుగోలుకు ముందుకు రావడంతో ధరలో పోటాపోటీ కనిపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.74  లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. 2.35 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా 7 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులు నాఫెడ్  ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, రాష్ట్రంలో మాత్రం మార్క్ ఫెడ్​ను నోడల్ ఏజెన్సీగా నియమించి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. ఈ క్రమంలో  ప్రైవేటు వ్యాపారులతో పోటీగా కందులు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరగనుంది. ఏఎంసీ, ఎంసీఎస్, పీఏసీఎస్​ల ద్వారా రాష్ట్రంలో 50 వేల టన్నుల కందులను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

పూర్తిగా కమర్షియల్ కొనుగోళ్లు చేపడుతాం

జిల్లాలో ఈ ఏడాది పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్  ఆధ్వర్యంలో  కమర్షియల్  కొనుగోళ్లు చేపట్టనున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మద్దతు ధర రూ.7 వేలు ఉండగా కమర్షియల్  కొనుగోలుతో రూ.10 వేలకు పైగా రైతులకు చెల్లించి కొనుగోలు చేస్తాం.

- ప్రవీణ్  రెడ్డి, మార్క్ ఫెడ్  డీఏం