కోహ్లీని మించిపోయేలా విలియంసన్ ఆట..సెంచరీతో విరాట్‌ను దాటేశాడు

కోహ్లీని మించిపోయేలా విలియంసన్ ఆట..సెంచరీతో విరాట్‌ను దాటేశాడు

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు అందరూ విరాట్ కోహ్లీ పేరునే చెప్పేస్తారు. ఇప్పటికే క్రికెట్ లో చాలా రికార్డులు తన పేరున లిఖించుకున్న విరాట్.. ఇటీవలే వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకొని సచిన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఓవరాల్ క్రికెట్ లో 25000 వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లీ ఆల్ టైం టాప్-5 బ్యాటర్ల లిస్టులో స్థానం సంపాదించాడు. మోడ్రన్ క్రికెట్ లో ఎవరూ కూడా కోహ్లీ దరి దాపుల్లో లేకపోవడం గమనార్హం. అయితే టెస్టు క్రికెట్ లో మాత్రం కోహ్లీ కాస్త వెనక పడినట్లుగానే కనిపిస్తున్నాడు. 

ఫ్యాబ్ 4 గా క్రికెట్ లో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్, రూట్, విలియంసన్ తో పోల్చుకుంటే కోహ్లీ యావరేజ్ తక్కువగానే ఉంది. మిగిలిన ముగ్గురు పోటీ పడి పరుగులు చేస్తుంటే కోహ్లీ బ్యాట్ నెమ్మదించింది. తాజాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ సెంచరీ బాదేసి కోహ్లీ రికార్డ్ సమం చేసాడు. ఇప్పటివరకు కోహ్లీ 111 టెస్టుల్లో 29 సెంచరీలు చేస్తే.. కేన్ 95 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.

ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 102 టెస్టుల్లో 32 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. రూట్ 30 సెంచరీలతో రెండో స్థానంలో నిలిస్తే.. విలియంసన్, కోహ్లీ వరుసగా మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు.టెస్టుల్లో కోహ్లీ యావరేజ్ 49 గా ఉంటే.. విలియంసన్ యావరేజ్ 55 ఉంది. వన్డేల్లో కింగ్ దరిదాపుల్లో కూడా లేని కేన్ టెస్టుల్లో మాత్రం టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 205 బంతుల్లో 11 ఫోర్లతో 104 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

గాయం నుంచి కోలుకున్న తర్వాత వరల్డ్ కప్ లో అదరగొట్టిన కేన్ మామ.. బంగ్లాదేశ్ పై ఆడుతున్న టెస్టులో కఠిన పిచ్ పై సెంచరీ చేశాడు. విలియంసన్ సెంచరీతో కివీస్ రెండో రోజు ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 310 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం న్యూజీలాండ్ 44 పరుగులు వెనకపడి ఉంది.