NZ v SA: 10 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు..దిగ్గజాలను దాటేసిన న్యూజిలాండ్ క్రికెటర్

NZ v SA: 10 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు..దిగ్గజాలను దాటేసిన న్యూజిలాండ్ క్రికెటర్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ టెస్టు క్రికెట్ లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. కొడితే కొట్టాలిరా సెంచరీ కొట్టాలి అనేలా విలియంసన్ ఫామ్ కొనసాగుతుంది. టెస్టులో ఒక సెంచరీ చేయడమే గ్రేట్. కానీ విలియంసన్ మాత్రం మంచినీళ్లు తాగినంత సింపుల్ గా సెంచరీలు కొట్టేస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి కెరీర్ లో 30 సెంచరీ పూర్తి చేసుకున్న విలియంసన్ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదేశాడు.

ఓపెనర్ టామ్ లేతమ్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఈ కివీస్ స్టార్ బ్యాటర్.. సఫారీ బౌలర్లను అలవోకగా ఆడేశాడు.132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ తో 109 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు వేగంగా బ్యాటింగ్ చేసిన విలియంసన్ 82 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసాడు. విలియంసన్ కు టెస్టు కెరీర్ లో ఇది కెరీర్ లో 31 వ సెంచరీ కాగా.. చివరి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఫ్యాబ్ 4 లో ఒకడిగా ఉంటున్న కేన్.. టాప్ లోకి దూసుకెళ్తున్నారు. 

ఈ సెంచరీతో టెస్టుల్లో వేగంగా 31 సెంచరీలు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. 170 ఇన్నింగ్స్ ల్లో 31 సెంచరీలు చేసి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తో సమానంగా నిలిచాడు. ఓవరాల్ గా ఈ రికార్డ్ క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ పేరిట ఉంది. 165 ఇన్నింగ్స్ ల్లో సచిన్ 31 సెంచరీల మార్క్ అందుకున్నాడు. 30 సెంచరీలతో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ హైడెన్, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం చంద్రపాల్, ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ లను అధిగమించాడు. 

విలియంసన్ సెంచరీతో దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. దీంతో తాళి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 528 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 511 పరుగుల చేస్తే..దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటైంది.