సుశాంత్‌ సూసైడ్‌పై ఆరోపణలు ప్రూవ్‌ చేయలేకపోతే పద్మశ్రీ ఇచ్చేస్తా: కంగనా

సుశాంత్‌ సూసైడ్‌పై ఆరోపణలు ప్రూవ్‌ చేయలేకపోతే పద్మశ్రీ ఇచ్చేస్తా: కంగనా

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ సూసైడ్ విషయంలో తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. సుశాంత్‌ చనిపోయిన తర్వాత కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియా ద్వారా వీడియో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఉందని, ప్రజర్‌‌ ఉంటుందని, వివక్ష చూపుతారని చాలా మందిపై ఆమె కామెంట్స్‌ చేశారు. అంతే కాకుండా కొంత మంది జర్నలిస్టులపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిరూపించలేకపోతే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానని ఆమె చెప్పారు. “ నేను ఆరోపణలు చేసినందుకు ముంబై పోలీసులు నాకు సమన్లు పంపారు. నేను మనాలీలో ఉన్నానని, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసేందుకు ఎవరనైనా పంపాలని చెప్పాను. కానీ నాకు వాళ్లు రెపాన్స్‌ ఇవ్వలేదు. నేను ఏదైనా చెప్పాను అంటే నిరూపించుకోగలను, లేని పక్షంలో నేను పద్మశ్రీ తిరిగి ఇస్తాను. నేను ప్రతీది పబ్లిక్‌గానే చెప్తాను” అని కంగనా రనౌత్‌ చెప్పారు. తాప్సీ, స్వరా భాస్కర్‌‌ లాంటి వారు బాలీవుడ్‌ను ప్రేమిస్తున్నామని చెప్తారని, కరణ్‌ జోహార్‌‌ లాంటి వాళ్లను అభిమానిస్తాం అని చెప్పినా ఆలియా, అనన్య లాంటి వాళ్లకు మాత్రమే ఎందుకు చాన్స్‌ వస్తుందని అని కంగనా ప్రశ్నించారు. ఇదే నెపోటిజమ్‌కి పెద్ద నిదర్శనం అని ఆమె చెప్పారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నందుకు నన్ను అందరూ పిచ్చిది అనుకుంటారని కూడా ఆమె అన్నారు. కంగనా రనౌత్‌ను విచారణకు హాజరు కావాలని పిలిస్తే రాలేదనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు అసలు పిలవలేదని, విచారణకు పిలిస్తే కంగనా కచ్చితంగా విచారణకు సహకరిస్తుందని ఆమె ప్రతినిధులు చెప్పారు.
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ది సూసైడ్‌ కాదని, ప్లాన్‌ మర్డర్‌‌ అని కంగనా రనౌత్‌ మొదటి నుంచి ఆరోపించారు. ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ ఉందని, కొందరికి మాత్రమే మంచి అవకాశాలు వస్తాయని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా వీడియోలు కూడా రిలీజ్‌ చేశారు.