శివ సేనను సోనియా సేనగా మార్చారు

శివ సేనను సోనియా సేనగా మార్చారు

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్రలోని అధికార శివ సేన మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బుధవారం బాంద్రాలోని పాళీ హిల్ లోని కంగనా బంగ్లాను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంటోంది. తాజాగా బీఎంసీతోపాటు శివ సేనపై కంగనా విమర్శలకు దిగింది. శివ సేన పార్టీ సోనియా సేనగా మారిందంటూ దుయ్యబట్టింది. బీఎంసీ అధికారులు గూండాలుగా వ్యవహరించారంటూ మండిపడింది.

‘ఏ భావజాలంతో బాలాసాహెబ్ ఠాక్రే శివ సేనను నిర్మించారో అలాంటి పార్టీ ఇవ్వాళ తన ఐడియాలజీని అమ్మడానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ శివ సేన నుంచి సోనియా సేనగా మారుతోంది. నా వెనుకు నుంచి నా ఇంటిని కూలగొట్టిన అధికారులను సివిక్ బాడీ అని పిలవొద్దు’ అని కంగనా ట్వీట్ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సిగ్గులేకుండా పొత్తు పెట్టుకొని శివ సేనను సోనియా సేనగా మార్చారని కంగనా కామెంట్ చేసింది. శివ సేనతోపాటు, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను ఉద్దేశించి.. ‘మీ నాన్న వల్ల మీకు ఐశ్వర్యం, సంపద లభించొచ్చు. కానీ గౌరవాన్ని మీరే సొంతంగా సంపాదించాలి. ఎన్ని నోళ్లను మీరు మూయిస్తారు. ఎన్ని గొంతుకలను అణచివేస్తారు. నిజం నుంచి ఎన్నాళ్లు పారిపోతారు?’ అని కంగనా పేర్కొంది.