స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు

స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడుతున్రు
  • తహసీల్దార్​ ఆఫీస్​, కేజీబీవీ ఎదుట స్టూడెంట్స్​ ఆందోళన 
  • స్పెషల్​ ఆఫీసర్​ను సస్పెండ్​ చేయాలంటూ డిమాండ్​

బెల్లంపల్లిరూరల్, వెలుగు: తమకు పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని కేజీబీవీ స్టూడెంట్స్​ ఆరోపించారు. స్పెషల్​ ఆఫీసర్(ఎస్​ఓ)ను సస్పెండ్​ చేయాలంటూ శనివారం తహసీల్దార్​ఆఫీస్​ఎదుట ధర్నాకు దిగారు. స్టూడెంట్లు మాట్లాడుతూ మెనూ పాటించడం లేదని, స్నాక్స్​ పెట్టడం లేదని చెప్పారు. ప్రశ్నిస్తే ఎస్ఓ అమూల్య బెదిరింపులకు దిగుతోందన్నారు. ఎస్సై సురేశ్, జడ్పీటీసీ సత్యనారాయణ స్టూడెంట్స్​తో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని డీఈఓకు ఫోన్​లో సూచించారు. ఎండ ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్లను ఆటోలో కేజీబీవీకి పంపించారు. కొద్దిసేపటికే స్టూడెంట్లు కేజీబీవీ ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నా చేసినందుకు మీ రిజల్ట్​ సంగతి చూస్తానని ఎస్ఓ తమను బెదిరించారంటూ ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మహేశ్వర్​రెడ్డి అక్కడికి వెళ్లి స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు ఈ రోజు మార్నింగ్​ చేసిన టిఫిన్​టేస్ట్​ చేయమని డీఈఓను అడిగారు. ముక్కిపోయిన బియ్యం, కుళ్లిన కూరగాయలను చూసి ఎస్​ఓపై డీఈఓ ఫైర్​ అయ్యారు. పద్ధతి మార్చుకోకుంటే సీరియస్​ యాక్షన్ ​తీసుకుంటామని హెచ్చరించారు. ముక్కిపోయిన బియ్యాన్ని ఎమ్మార్సీకి తరలించాలని ఎంఈఓను ఆదేశించారు. అనంతరం స్టూడెంట్స్​ లీడర్లు, పేరెంట్స్​ డీఈఓకు వినతిపత్రం ఇచ్చి ఎస్​ఓను సస్పెండ్​ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్​, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాక్షన్​ తీసుకుంటామని ఆయన చెప్పారు. 

ఆ ప్రిన్సిపల్​ మాకొద్దు: స్టూడెంట్స్​ 
ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: మావల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయం ప్రిన్సిపల్​ భూలక్ష్మిని వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఆ ప్రిన్సిపల్​ మాకొద్దంటూ శనివారం మధ్యాహ్నం మావల నుంచి స్టూడెంట్లు చెప్పులు లేకుండా కాలినడకన కలెక్టరేట్​కు తరలివచ్చి ధర్నా చేశారు.  కలెక్టర్ ​లేకపోవడంతో జడ్పీ ఆఫీస్ ముందు రెండు గంటలపాటు బైఠాయించారు. ప్రిన్సిపల్​ భూలక్ష్మి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే పోలీస్​ కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. అడిషనల్​ కలెక్టర్ ​రిజ్వాన్​భాషా అక్కడికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు. ప్రిన్సిపల్, వైస్​ప్రిన్సిపల్​పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం స్టూడెంట్లను బస్ ​ఏర్పాటు చేసి అందులో కాలేజీకి పంపించారు.