కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ వద్ద పోలీస్​ కాపలా

 కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ వద్ద పోలీస్​ కాపలా
  • ఐదు గేట్ల వద్ద 30 మంది మోహరింపు..  సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ సిబ్బందికి కూడా డ్యూటీలు
  • ‘మేఘా’ సెక్యూరిటీ గార్డులు అదనం.. మొన్నటిదాకా టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌గా ప్రచారం
  • మునిగిన నాటి నుంచి సీన్‌‌‌‌ రివర్స్‌‌‌‌.. ఏ తప్పూ జరగకపోతే ఎందుకు చూడనివ్వట్లే
  • నీళ్ల తోడివేతకు ఇంజినీర్ల తిప్పలు.. అన్నారం పంప్​హౌస్​లో బయటపడ్డ ఫస్ట్ ఫ్లోర్

భూపాలపల్లి / మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : మొన్నటిదాకా గొప్ప టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌గా రాష్ట్ర సర్కారు ప్రచారం చేసిన కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌హౌస్ ఇప్పుడు పోలీస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లా మారిపోయింది. నిత్యం వందల మందిని సందర్శించేందుకు అనుమతించిన ఆఫీసర్లు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేను కూడా అటుదిక్కు రానివ్వట్లేదు. కనీవినీ ఎరుగని రీతిలో కట్టిన ప్రాజెక్ట్‌‌ అని.. ఒక్కసారైనా చూసి తరించాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తీసుకొచ్చి మరీ చూపించిన మన ఇంజినీర్లు ఇప్పుడు ముఖం చాటేశారు. గోదావరి వరదలకు ఈ నెల 14న కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ నీట మునిగినప్పటి నుంచి సీన్‌‌‌‌ రివర్స్‌‌‌‌ అయ్యింది. ఏకంగా ‘విజిటర్స్‌‌ నాట్‌‌ అలోడ్‌‌‌‌’ అనే బోర్డులు పెట్టారు. అక్కడ జరిగిన ఇంజినీరింగ్, రాష్ట్ర ప్రభుత్వ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ప్రజల సేఫ్టీ పేరిట కొత్త నాటకం మొదలుపెట్టారు.

ఎవరొచ్చినా అడ్డుకునుడే
భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై కట్టిన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌‌‌‌హౌస్​కు 5గేట్లున్నాయి. 15వ తేదీ నుంచి ఐదు గేట్ల దగ్గర కాపలా కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 మంది పోలీసులను నియమించింది. సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ బలగాలను కూడా మోహరించింది. మేఘా కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు అదనంగా పని చేస్తున్నారు. పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ దగ్గరికి ఎవరినీ రాకుండా అడ్డుకోవడం పై విస్మయం వ్యక్తమవుతోంది.

పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ గేట్‌‌‌‌ లోపల కాళేశ్వరం పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌
కాళేశ్వరం పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​లోపల ఉంది. గేట్‌‌‌‌‒1 నుంచి వెళ్తే గానీ పీఎస్​ను చేరుకోలేరు. ఈ పీఎస్​ పరిధిలో పలుగుల, కుంట్లం, మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం, కాళేశ్వరం, కన్నెపల్లి, బీరసాగర్‌‌‌‌ గ్రామాలున్నాయి. ఈ ఠాణా పరిధిలో 10 వేల జనాభా ఉంది. పీఎస్​కు వెళ్లేందుకు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితులున్నా ఠాణా వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వస్తున్నది.

పడవ, స్విమ్మర్లతో పనులు.. 
కన్నెపల్లి పంప్‌‌‌‌హౌజ్​ నుంచి నీళ్లు బయటికి తీసేందుకు ఇంజినీర్లు పెద్ద సాహసమే చేస్తున్నారు. హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ వద్ద ఉన్న సమస్యతో ఫోర్‌‌‌‌బేలోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. దీంతో గేట్లు పగిలిపోవడమో లేదా లీక్‌‌ కావడమో జరుగుతోంది. ఈ నీటిని ఆపితే తప్ప పంప్​హౌజ్​లో నీళ్లు తోడడం సాధ్యం కాదు. గురువారం హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ వద్ద పనులు స్టార్ట్‌‌‌‌ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు స్విమ్మర్లను రప్పించారు. శుక్రవారంలోగా హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ సమస్య పరిష్కరించే చాన్స్​ ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఫోర్‌‌‌‌ బేలో 3 ఫీట్ల మేర నీళ్లు తగ్గడంతో మోటార్లకు రక్షణగా కట్టిన ఫోర్‌‌‌‌ బేస్‌‌‌‌మెంట్‌‌‌‌ గోడ కనిపిస్తోంది. దీంతో మునిగిన మోటార్లను వెలికితీయడానికి నీళ్లు పంప్ చేసేందుకు1500 హెచ్‌‌‌‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను ఆఫీసర్లు రెడీ చేశారు. మూడు జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ సమస్య పరిష్కారం కాగానే డీ వాటరింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయవచ్చని ఓ ఇంజినీర్‌‌‌‌ తెలిపారు.

నీళ్లు కూడా తోడకుండానే నష్టంపై ప్రకటన
పంప్‌‌‌‌హౌస్ చుట్టూ ఉన్న 5 గేట్లను మూసి 30 మంది పోలీసులను కాపలా పెట్టారు. మేఘా కంపెనీ సెక్యూరిటీ గార్డులను కూడా లోపలికి అనుమతించట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణ ప్రక్రియలో పాల్గొన్న ఒకప్పటి భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌ ఆకునూరి మురళిని సైతం వెనక్కి పంపించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌‌‌‌ బాబు.. తీన్మార్‌‌‌‌ మల్లన్నను అటువైపు రానివ్వలేదు. ప్రభుత్వం, ఇంజినీర్లు తప్పు చేయకపోతే కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ వద్దకు మేధావులను, మీడియాను ఎందుకు అనుమతిస్తలేరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కన్నెపల్లి పంప్​హౌస్​లో హెడ్​ రెగ్యులలేటర్ నుంచి వాటర్ లీకేజీతో నీళ్ల తోడివేత మొదలేపెట్టలేదు. అన్నారం పంప్​హౌస్​లో నీళ్ల తోడివేత కొనసాగుతుండగా, పది ఫ్లోర్లలో కేవలం ఒక ఫ్లోర్ బయటపడింది. నీళ్లు తోడివేస్తే కానీ నష్టంపై ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.20 నుంచి రూ.25 కోట్ల నష్టమే వాటిల్లిందని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

బురదలో మెషినరీ
అన్నారం పంప్​హౌస్​లో నీళ్లను తోడుతుండడంతో పంప్​హౌస్​లోని ఒక ​ఫ్లోర్​బయటపడింది. ఇందులో మొత్తం పది ఫ్లోర్లు ఉండగా, మరో 70 అడుగుల వరకు నీటిలోనే మునిగి ఉంది. నీళ్లన్నీ తోడేందుకు చాలా రోజులు పట్టే అవకాశముందని ఇంజినీర్లు చెప్తున్నారు. ఒక ​ఫ్లోర్ తేలడంతో మెషినరీ, ఎలక్ట్రిక్ సామగ్రి మొత్తం బురదలో కూరుకుపోయి కనిపిస్తోంది. ఈ బురదను మొత్తం ఎత్తిపోస్తే తప్ప పరిస్థితి ఏమిటన్నది తెలియదు. పార్వతి బ్యారేజ్ సమీపంలోనే అన్నారం పంప్​హౌస్ ఉంది. బేస్​వాల్​పటిష్టంగా లేకపోవడం వల్లే పంపులు మునిగినట్లు చెప్తున్నారు. కిందటేడు పంపులు మునిగే పరిస్థితి ఏర్పడినప్పుడు పంప్​హౌస్ చుట్టూ కట్టలు పోశారు. ఇటీవలి వరదలకు ఆ కట్టలు కొట్టుకుపోయి మొత్తం మునిగింది.
‑ పెద్దపల్లి, వెలుగు