కాన్పూర్ లో హై ఫ్రొఫైల్ లంబోర్గిని రెవెల్టో కారు క్రాష్ కేసులో కీలక అప్డేట్.. వేల కోట్ల పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివం మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఖరీదైన లగ్జరీస్పోర్ట్ కారును వేగంగా నడుపుతూ పాదచారులు, వాహనాలను ఢీకొట్టిన కేసులో యూపీకి చెందిన వేల కోట్ల పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కొడుకు శివం మిశ్రాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ఆరోపించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు.
ఆదివారం మధ్యాహ్నం కాన్పూర్ లోని వీఐపీ రోడ్డులో లంబోర్గినీ రెవెల్టో కారు ఢీకొని పుట్ పాత్ పై నిల్చున్న తౌఫిక్ మహ్మద్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బుల్లెట్ బైకు ఢీకొట్టి ఆ తర్వాత తౌఫిక్ పైకి దూసుకెళ్లింది. కారు వేగానికి మహ్మద్ కొన్ని మీటర్లు దూరం ఎగిరిపడ్డాడు.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో శివం మిశ్రా కూడా గాయపడ్డాడు. మరో కారులో వచ్చిన అతని బౌన్సర్లు మిశ్రాను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో శివం మిశ్రా మద్యం సేవించి కారును నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడు తౌఫిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా శివం మిశ్రాను అరెస్ట్ చేశారు.
