Rishab Shetty : 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాలీవుడ్ షేక్! అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ ఎంతంటే?

Rishab Shetty : 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాలీవుడ్ షేక్! అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ ఎంతంటే?

కన్నడ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన 'కాంతార'కు ప్రీక్వెల్ అయిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం మరి కొన్ని గంటల్లో థీయేటర్లలో సందడి చేయనుంది. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పండుగ సీజన్ లో ఇది కేవలం అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్నడ చిత్రాలలో ఒకటిగా మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలవుతున్న అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 

అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని కోట్లంటే?

నటుడు రిషబ్ శెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన  'కాంతార' చిత్రం, 2022లో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇది'కాంతార'కు పూర్వ కథగా తెరకెక్కించిన 'కాంతార చాప్టర్ 1' గా భారీ అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు వస్తోంది .  ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 'కాంతార చాప్టర్ 1' తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్ మొత్తం వసూళ్లు అన్ని భాషల్లో కలిపి రూ.12 కోట్లు దాటాయి. ఈ సంఖ్యలో సింహభాగం కన్నడ వెర్షన్‌దే కావడం విశేషం. కన్నడలోనే రూ.7.85 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. హిందీ వెర్షన్ కూడా స్థిరంగా పెరుగుతూ రూ. 2 .10కోట్ల గ్రాస్ బుకింగ్‌ను నమోదు చేసింది. తెలుగులో రూ. 1.31 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది.  తమిళ, మలయాళ వెర్షన్ల నుంచి వసూళ్లు తెలియాల్సి ఉంది. ఇక  ఆక్టోబర్ 1న సాయంత్రం ప్రీమియర్ షో కూడా ప్రదర్శించనున్నారు.  ఈలెక్కన ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పాన్-ఇండియా టార్గెట్ ఎంత?

'కాంతార' (2022) తొలి రోజు కేవలం కన్నడలోనే విడుదలై, ఆ తర్వాత రెండు వారాలకు ఇతర భాషల్లో డబ్ అయి కూడా దేశవ్యాప్తంగా రూ.220 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అందులో హిందీ నుంచే రూ. 84 కోట్లు వచ్చాయి. ఈసారి 'చాప్టర్ 1' ఒకే రోజు ఐదు భాషల్లో (కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం) విడుదల అవుతుండటంతో, భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, 'కాంతార చాప్టర్ 1' భారతదేశంలో తొలి రోజు రూ.30 కోట్ల నెట్ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది. మరింత లిబరల్‌గా చూస్తే, ఈ సంఖ్య రూ.40 కోట్ల వరకు కూడా చేరవచ్చని అంచనా వేస్తున్నారు. .

బాలీవుడ్‌ షేక్.. సౌత్ స్టార్స్‌తో పోటీ

ఈ అంచనాల్లో కేవలం హిందీ వెర్షన్ నుంచే రూ.15 నుంచి17 కోట్ల నెట్ ఓపెనింగ్ రావచ్చని కాంతార మూవీ మేకర్స్ భావిస్తున్నారు. వాస్తవానికి, వారం రోజుల క్రితం హిందీలో రూ.25 కోట్ల ఓపెనింగ్‌ను ట్రేడ్ ఆశించింది, కానీ బుకింగ్ ట్రెండ్‌ల కారణంగా అంచనాలు కాస్త తగ్గాయి.

అయినా సరే, రూ.35- నుంచి 40 కోట్ల ఓపెనింగ్ సాధిస్తే, ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాలైన 'సైయారా' (రూ.22 కోట్లు), 'సికందర్' (రూ.26 కోట్లు), 'ఛావా' (రూ.31 కోట్లు) కంటే 'కాంతార చాప్టర్ 1' కచ్చితంగా ముందుంటుంది. అయితే, ఈ ఏడాది వచ్చిన అగ్ర పాన్-ఇండియా చిత్రాలైన పవన్ కళ్యాణ్ 'OG' (రూ.84 కోట్లు) , రజనీకాంత్ 'కూలీ' ( రూ.65 కోట్లు) తో మాత్రం పోటీ పడలేదు.

కథా నేపథ్యం

'కాంతార చాప్టర్ 1' కథ మొదటి 'కాంతార'లోని సంఘటనలకు శతాబ్దాల పూర్వం జరుగుతుంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం, తొలి భాగంలో చూపించిన రహస్యాలు , 'దైవ నర్తనం' ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. రిషబ్ శెట్టి విభిన్నమైన ఆహార్యంతో, మరింత ఉగ్రమైన పాత్రలో కనిపిస్తుండటం అభిమానులకు మరింత ఆసక్తిని పెంచుతోంది. దసరా పండుగ ఉత్సాహంలో ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.