'కన్యా కుమారి' రివ్యూ: పాత కథతో కొత్త ఫీలింగ్, యువతకు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ డ్రామా!

'కన్యా కుమారి' రివ్యూ: పాత కథతో కొత్త ఫీలింగ్, యువతకు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ డ్రామా!

యువ నటుడు శ్రీ చరణ్, గీత్ సైని జంటగా నటించిన చిత్రం 'కన్యా కుమారి' వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ( ఆగస్టు 27-న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా,  దర్శకుడిగా, నిర్మాతగా సృజన్ అట్టాడ వ్యవహరించారు. సినిమాటోగ్రఫీ శివ గాజుల, హరిచరణ్, సంగీతం రవి నిడమర్తి అందించారు.   టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఇప్పడు థియేటర్లతో సండిచేస్తోంది. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదా చూద్దాం..

కథాంశం.. 
కథాంశం విషయానికొస్తే, ఇది తిరుపతి (శ్రీచరణ్) కన్యాకుమారి (గీత్ సైని) అనే ఇద్దరు స్నేహితుల కథ. తిరుపతికి వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉండి రైతు కావాలని కలలు కంటాడు, కన్యాకుమారి మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. తిరుపతి చదువు మానేసి రైతు కావడంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ తర్వాత బట్టల షాపులో పని చేస్తున్న కన్యాకుమారి, తన పెళ్లి విషయంలో 'జాబ్ ఉన్న అబ్బాయి, సిటీలో ఉండాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేయాలి' అని కండిషన్స్ పెడుతుంది. అదే సమయంలో, రైతు అయినందున తిరుపతికి పెళ్లి సంబంధాలు రావు.

అనుకోకుండా మళ్లీ కలిసినప్పుడు, తిరుపతి తన పాత ప్రేమని కన్యాకుమారికి వ్యక్తం చేస్తాడు. అయితే, ఆమె తన ఆశయాలకు అడ్డుగా ఉన్న తిరుపతిని కాదని, తనను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేసే సంబంధానికి ఓకే చెబుతుంది. కన్యాకుమారి కోసం తిరుపతి తన ఇష్టమైన వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగంలో చేరతాడు. చివరికి వారిద్దరి ప్రేమ గెలిచిందా, వారి ఆశయాలు ఏమయ్యాయనేది సినిమా చూడాలి.

పాత కథ, కొత్త స్నేహాలు
'కన్యా కుమారి' ఒక రొటీన్ గ్రామీణ ప్రేమకథ అయినప్పటికీ, దర్శకుడు దీనిని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. శ్రీకాకుళం యాస, పల్లెటూరి వాతావరణం సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. మొదటి భాగం క్యూట్ లవ్ స్టోరీతో, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ సాఫీగా సాగిపోతుంది. రెండో భాగం మధ్యలో కథ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.  అయితే ఈ సినిమాలో ఆడపిల్ల చదువుకోవాలి, ఎదగాలి అనే కాన్సెప్ట్‌తో పాటు రైతు విలువను కూడా బాగా చూపించారు. అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. 

 శ్రీచరణ్ (తిరుపతి) ఒక రైతుగా, ప్రేమికుడిగా శ్రీచరణ్ పర్వాలేదనిపించాడు.  గీత్ సైని (కన్యాకుమారి) పల్లెటూరి అమ్మాయిగా, ఆశయాలున్న యువతిగా, సేల్స్ గర్ల్‌గా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన సినిమాకు ప్రధాన బలం. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఒకరకంగా పర్వాలేదు.. దర్శకత్వం, సంభాషణలు పర్వాలేదు. ఎడిటింగ్‌లో రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు తొలగించి ఉంటే బాగుండేది. ఈ సినిమా ఒక పల్లెటూరి ప్రేమకథను ఇష్టపడేవారికి మంచి ఎంపిక కావచ్చు .