ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీ బలిపశువు కాబోతోంది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీ బలిపశువు కాబోతోంది

హైదరాబాద్: మహహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి వేసిన టీఆర్ఎల్డీ తరపున వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు కపిలవాయి దిలీప్ కుమార్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడంతో తన నామినేషన్ ను ఉపసంహరించుకొని, ఆ పార్టీ నుంచి  పోటీ చేస్తున్న రామచంద్రరావు కు తన మద్దతు తెలిపారు. బండి సంజయ్ తన ఆఫీసుకు వచ్చి కోరడంతోనే నామినేషన్  విత్ డ్రా చేసుకుని, బిజెపిలో చేరినట్టు ఆయన తెలిపారు.

అనంతరం దిలీప్ కుమార్ మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ ఓ కుటిల రాజకీయ వేత్త అని రాజకీయ అవగాహన లేని వారికి కూడా తెలుసని అన్నారు.  ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయాక పీవీ ని కేసీఆర్ తో కలిసి ఢిల్లీలో కలిశామన్న దిలీప్ .. ఆనాడు ఢిల్లీలో పీవీని  సమైక్యవాది అని కేసీఆర్ అన్నారని , అలాంటి చంద్రశేఖర్ రావు కి ఈరోజు పీవీ జ్ఞాపకం రావడం ప్యూర్ లీ రాజకీయమని అన్నారు. పీవీ కూతురు వాణీ ఎమ్మెల్సీ  అభ్యర్ధిత్వం తో కుల పంచాయితీ పెట్టాలని, బ్రాహ్మణ ఓట్లు దండు కుందామని కేసీఆర్ చూస్తున్నారన్నారు. కెసిఆర్ కు పీవీ మీద ఏనాడు ప్రేమ లేదని, వాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలిపశువు కాబోతోందన్నారు

అందరిని మోసం చేసేందుకే వాణి ని అభ్యర్థిగా ప్రకటించారని, అవకాశం ఉంటే ఆమె కూడా వచ్చి 3 గంటలోపు  విత్ డ్రా  చేసుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎవరికీ అవకాశం వచ్చిన వారు వినియోగించుకోవాలని, విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు దిలీప్ .

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని,  ఢిల్లీలో ఏ రోజు సీఎం చుట్టూ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) రైడ్స్ మొదలవుతాయో తెలియదన్నారు.  సీఎం కేసీఆర్ సంపాదన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కన్నా ఎక్కువని , ఆ డబ్బుల జాబితా అంతా ఈడీ రెడీ గా పెట్టుకుందని అన్నారు. సీఎం కోటరీ చుట్టూ రైడ్స్ చేయవచ్చని చెప్పారు.