నాయకులెవరూ మా ఊరికి రావొద్దు: కపూర్ నాయక్ తండావాసులు

నాయకులెవరూ మా ఊరికి రావొద్దు: కపూర్ నాయక్ తండావాసులు

హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ తో తమ భూములపై హక్కులు కోల్పోయామని, నాయకులెవరూ తమ ఊరికి రావొద్దని, ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండావాసులు ప్రకటించారు. పదేండ్ల నుంచి సమస్యను పరిష్కరించకపోవడంతోనే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తీర్మానం చేశారు. గురువారం గ్రామ సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో గిరిజనులంతా సమావేశమై ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ తండాకు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. 

కాగా ముందే సర్పంచ్​సంతోష్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకుంటాడేమోనని పోలీసులు సర్పంచ్​ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో భూముల సమస్యపై ఎమ్మెల్యేను ఎవరూ అడగలేకపోయారు. గురువారం సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో సమావేశమై భూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఓటు వేయకపోతే లీడర్లు కదిలొస్తారన్నారు. తండాలోని గిరిజనులకు చెందిన సుమారు1000 ఎకరాలు నందారం గ్రామ పరిధిలో ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు వాటిని సాగుచేసుకుంటున్నారు. 

ఇవి ధరణిలో సీలింగ్ భూములుగా నమోదు చేశారని, అందుకే తమకు పట్టాలు, విరాసత్ కావడంలేదని చెబుతున్నారు. ‘‘ధరణి తీసుకొచ్చి మా భూములకు పట్టాలు కాకుండా చేసిండ్రు. ఊరుపుట్టినప్పటి నుంచి భూములు దున్నుకొని బతుకుతున్నం. కేసీఆర్ సర్కార్ వచ్చిన నుంచి మా భూములన్నీ సీలింగ్ లో పడేసిండ్రు. పట్టాలు అయితలేవు. 

విరాసత్ అయితలేదు. పదేండ్లసంది గోసపడుతున్నం. ఆఫీసర్లు, ఎమ్మెల్యే సుట్టూ తిరిగి యాస్టకొచ్చినం. ఎవలూ పట్టించుకోకపోతే పోయిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓట్లను బహిష్కరించినం. అప్పుడు ఎమ్మెల్యే, ఆఫీసర్లు వచ్చి భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూస్తామని మాట ఇచ్చిండ్రు. అయినా సమస్య అట్లనే ఉన్నది’ అని తండావాసులు ఆవేదన వ్యక్తంచేశారు. 

ALSO READ : బీఆర్​ఎస్​కు కడెం ఎంపీపీ రాజీనామా