
ప్రముఖుల బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇటీవలే తెలుగులో పీవీ నరసింహారావు బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అలాంటి ఓ సినిమానే అనౌన్స్ చేశారు. ఒకప్పటి లాయర్, యాక్టివిస్ట్ సి.శంకరన్ నాయర్ లైఫ్ స్టోరీ ఇది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించబోతున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా శంకరన్ నాయర్ వ్యవహరించారు. జలియన్‌వాలా బాగ్ ఊచకోత తర్వాత వైస్రాయ్ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆ ఇన్సిడెంట్స్పై నిజానిజాలను వెలికి తీసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంపై కోర్టులో పోరాడారు. మైఖేల్ ఓ డయ్యర్ ఈ ఊచకోతకి కారణమని ఆయన కేసు కూడా వేశారు. ఆ ఇన్సిడెంట్స్ ఆధారంగానే ఈ సినిమా తీయబోతున్నారు. శంకరన్ మనవడు, అతని భార్య కలిసి రచించిన ‘ద కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ అనే పుస్తకం ఈ చిత్రానికి ఆధారం. ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి.శంకరన్ నాయర్’ అనే పేరుని ఈ చిత్రానికి ఖాయం చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో రివీల్ చేస్తామన్నారు. నాయర్ కథని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ సినిమా చేస్తున్నట్టు కరణ్ జోహార్ ప్రకటించారు. గతంలో గాంధీ, రంగ్దే బసంతి, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ లాంటి చిత్రాల్లో జలియన్‌వాలా బాగ్ ఇన్సిడెంట్‌ని టచ్ చేశారు. కరణ్ నిర్మించే ఈ సినిమాలో ఎలాంటి విషయాలు చూపించబోతున్నారో చూడాలి!