- అటవీ అధికారుల కనుసన్నల్లోనే ఏజెన్సీ కలప అక్రమ తరలింపు
- రూ.లక్షలు తీసుకొని కలప అక్రమ కేసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పేరు తొలగింపు
- అడవులు ఆక్రమణకు గురై గుట్టలే మిగిలాయి
ఖమ్మం/ కారేపల్లి, వెలుగు : జిల్లాలోని కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ లో అడవి తల్లి ఆనవాళ్లు కోల్పోతోంది. ఉమ్మడి జిల్లాలో ఏడు మండలాల పరిధిలో 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవులు నేడు ఆక్రమణకు గురై కేవలం గుట్టలు మిగిలాయి. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వాటిని కూడా కాపాడలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. అటవీ భూములు, సంపద, ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న పచ్చని చెట్లను కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బంది.. కంచే చేను మేసిన చందంగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఏజెన్సీ కలపకు అక్రమ పర్మిట్లు..!
కారేపల్లి మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో మండల కేంద్రమైన కారేపల్లి మినహా మిగతా అన్ని ఏజెన్సీ గ్రామాలే. ఈ గ్రామాల పరిధిలోని చింత, వేప, తుమ్మ తదితర చెట్లను నరికి కలపను తరలించడానికి వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేవు. కానీ వందలాది ట్రిప్పుల కలప గత కొన్నేళ్లుగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలిపోతోంది. వీటిల్లో చాలా వరకు కారేపల్లి పేరుతో పర్మిట్లు ఇచ్చి కొందరు అటవీశాఖ సిబ్బందే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని కలపను, నాన్ ఏజెన్సీ గ్రామమైన కారేపల్లి పేరుతో పర్మిట్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా కొందరు ఫారెస్ట్ సిబ్బంది కనుసన్నల్లో సాగుతోంది. నాన్ ఏజెన్సీ గ్రామమైన కారేపల్లి ప్రాంతం 2 కిలోమీటర్ల పరిధిలో తక్కువ విస్తీర్ణంలోనే ఉంది. ఈ పరిధిలో కొట్టిన చెట్లు నామమాత్రమే.
అక్రమ కలపను పట్టుకున్నా, పేర్లు మాయం..
మండలంలోని మేకల తండాలో ఆగస్టు 12న ఓ ఇంట్లో లక్షల విలువైన అక్రమ కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నా రు. సుమారు రూ.3 లక్షల విలువైన కలపను పట్టుకుని కేసు నమోదు చేశారు. మేకల తండాలో భారీగా కలప దొరికిన ఇంటి యజమాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయనపై కేసు పెట్టకుండా అతడి బంధువైన మరో కార్పెంటర్ పై కేసు నమోదు చేశారు. కలప దొరికిన ఇంటి యజమాని పేరు తొలగించడానికి, దొరికిన కలపను తక్కువ రేటుతో చూపించడానికి దాదాపు రూ.3 లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలు ఈ రేంజ్ పరిధిలో ఎన్నో జరుగుతున్నాయి.
అడవి మాయం, మిగిలింది గుట్టే..!
ఖమ్మం జిల్లాలోనే పెద్ద అటవీ రేంజ్ గా పేర్కొందిన కారేపల్లి ఫారెస్ట్ రేంజ్.. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉంది. ఇక్కడ ఓ రేంజర్, డిప్యూటీ రేంజర్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది కలిపి 20 మంది వరకు విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో ఇక్కడ జరిగిన ఆక్రమణలను ఈ శాఖ ఏ స్థాయిలో అక్రమాలను ప్రోత్సహించిందో చూపడానికి కారేపల్లి గుట్టే నిదర్శనం.
కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ నుంచి చూస్తే కనుచూపు మేరలోనే ఈ గుట్ట కనపడుతుంది. ఆ గుట్టపై 5 ఎకరాల వరకు ఓ మత సంస్థ వారు చదును చేయించి భారీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇదే గుట్టకు మరోవైపు డోజర్లు పెట్టి నాలుగు ఎకరాలు ఓ నాయకుడు చదును చేయించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇక్కడ అక్రమాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మండలంలోని చీమలపాడు, బాజు మల్లయ్యగూడెం, తవిసిబోడు, మాణిక్యారం అటవీ ప్రాంతాల్లో గత ఐదేండ్లలో అక్రమంగా మూడు వేలకు పైగా బోర్లు వేశారు. ఒక్కో బోరు వేసేందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కొందరి ఫారెస్ట్ సిబ్బందికి ఇచ్చి బోర్లు వేశారనేది బహిరంగ రహస్యమే. దీంతోపాటు ఈ అటవీ ప్రాంతాల్లో విద్యుత్ ఉచ్చులను అమర్చి అడవి జంతువులను వేటాడటం కూడా జరుగుతోంది. ఈ రేంజ్ పరిధిలో జరిగే అక్రమాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పేరుపల్లిలో 230 టేకు చెట్లు మాయం..!
కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో పేరుపల్లికి చెందిన ఓ రైతు మల్లన్నగూడెం రోడ్డు ప్రాంతంలో పొలం గట్ల మీద సుమారు 230 టేకు చెట్లను ఏపుగా పెంచాడు. ఈ టేకు చెట్లన్నీ పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా ఈ చెట్లన్నీ మాయమై మొట్లు మాత్రం సాక్ష్యంగా మిగిలాయి. ఈ టేకు చెట్లను నరికించి అక్రమంగా తరలించిన వ్యవహారం కూడా కొందరి ఫారెస్ట్ సిబ్బంది కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి.
