
- శాతవాహన వర్సిటీ ఎదుట దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్, వెలుగు: దేశమంతా సైనిక చర్యను కొనియాడుతుంటే.. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు కరీంనగర్ లో గురువారం ఆందోళనకు దిగాయి. శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీజేపీ మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రొఫెసర్ సుజాతను సస్పెండ్ చేయాలని కోరుతూ శాతవాహన వర్శిటీ వీసీ ఉమేశ్‌కుమార్ కు వినతిపత్రం అందించారు. అలాగే దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ సుజాత వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు వినతిపత్రం అందజేశారు.
క్షమాపణలు కోరిన ప్రొఫెసర్ సుజాత
ఫేస్ బుక్‌లో తన కామెంట్స్ పై ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత క్షమాపణలు చెప్పారు. 'నేను వృత్తి రీత్యా ఒక ప్రొఫెసర్ ను, సామాజిక భాధ్యతతో నేటికీ అనేక సామాజిక కార్యక్రమాలు నా సొంత డబ్బుతో చేస్తున్న విషయం మీకందరికీ తెలుసు. ఒక పరిశోధకురాలిగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తులు వచ్చి పోస్ట్ చేశాను. తప్పితే దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై ఎలాంటి అగౌరవంతో కాదు. నేను బాధ్యత కలిగిన పౌరురాలిని.
దేశం అంటే భక్తి ఉంది కాబట్టే నేను స్పందించాను. నా కామెంట్స్ ఎవరినీ, ఏ మతాన్ని, సందర్భాన్ని కించపరిచేవి కావు. ఎవరైనా బాధపడినా, మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాల్సిందిగా వేడుకుంటూ నా వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నాను.' అని వెల్లడించారు.