కళ తప్పిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి .. రూ. 224 కోట్లతో నిర్మించినా మెయింటెనెన్స్ కరువు

కళ తప్పిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి .. రూ. 224 కోట్లతో నిర్మించినా మెయింటెనెన్స్ కరువు
  • బ్రిడ్జిపైన రోడ్డుకు రెండేళ్లలో తరుచూ రిపేర్లు 
  • ఏడాదిన్నరగా పని చేయని డైనమిక్ లైటింగ్ సిస్టమ్
  • నిర్వహణకు ముందుకు రాని కాంట్రాక్ట్ సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్, సుడా 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని  కేబుల్ బ్రిడ్జి కళ తప్పింది.  రూ.224 కోట్ల వ్యయంతో నిర్మించి సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జికి మెయింటనెన్స్ కరువైంది. దీంతో ఏడాదిన్నర కాలంగా డైనమిక్  లైట్లు వెలగక రాత్రయితే చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి. ప్రారంభించిన ఆర్నెళ్లకే కేబుల్ బ్రిడ్జిపై తారు లేయర్ లేచిపోవడంతో రోడ్డుపై రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారింది. రెండేళ్లలో పలుమార్లు రిపేర్లు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. కేబుల్ బ్రిడ్జి మెయింటెనెన్స్ ను ఇటు కాంట్రాక్ట్ సంస్థగానీ, మున్సిపల్ కార్పొరేషన్, సుడా, ప్రభుత్వ విభాగాలు చేపట్టకపోవడంతో కోట్లాది రూపాయల ప్రాజెక్టు గాలికొదిలేసినట్లయింది. 

రూ.224 కోట్లతో పనులు.. 

కరీంనగర్ సిటీని టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేసేందుకు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ - సదాశివపల్లి మధ్య 2018లో రూ.184 కోట్లతో 500 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. కేబుల్ బ్రిడ్జిని అన్ని హంగులు కలిపి నిర్మాణ వ్యయం రూ.224 కోట్లకు చేరింది. కేబుల్ బ్రిడ్జి రాత్రిపూట కలర్ ఫుల్ గా జిగేల్ మని కిలోమీటర్ల దూరం వరకు కనిపించేలా రూ.8 కోట్లతో డైనమిక్  లైటింగ్ సిస్టంతో పాటు రెండు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 

 కేబుల్ బ్రిడ్జికి ఇదే మెయిన్ అట్రాక్షన్ గా ఉండేది. 2023 జూన్ 21న అప్పటి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ఈ బ్రిడ్జిని అట్టహాసంగా ప్రారంభించారు.  ఆ తర్వాత వీకెండ్స్ లో 'మస్తి' పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే వాహనాల రాకపోకలు, వర్షాలతో బ్రిడ్జిపై వేసిన తారు రోడ్డు దెబ్బతింది. పలుమార్లు రిపేర్ చేసినా తారు లేయర్ నిలవలేదు. ఇటు రోడ్డు బాగోలేక.. అటు లైట్లు వెలగక సిటీ జనం ఆహ్లాదం కోసం అటు వైపు రావడమే మానేశారు. బ్రిడ్జిపై చీకటి ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారింది.

మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది ? 

కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి మెయింటెనెన్స్ బాధ్యతను ఇప్పటి వరకు ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. బిల్ట్ అండ్ ఆపరేట్, ట్రాన్స్ ఫర్(బీఓటీ) పద్ధతిలోనే  ఓ ప్రైవేట్ కంపెనీ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు సమాచారం. దీంతో నిర్మాణం పూర్తి చేసి, డైనమిక్ లైటింగ్ వెలిగించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం వరకే సదరు సంస్థ పరిమితమైనట్లు తెలిసింది. 

దీంతో ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి నిర్వహణను ఎవరు చూసుకోవాలి ? బ్రిడ్జిపై సెక్యూరిటీ బాధ్యత ఎవరిది ? పరిశుభ్రంగా ఉండేలా ఎవరు చూసుకోవాలి? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. బ్రిడ్జి మెయింటనెన్స్ ను మున్సిపల్ కార్పొరేషన్ కు లేదా సుడాకు అప్పగించాలని ఆర్ అండ్ బీ శాఖ ప్రయత్నించినప్పటికీ.. ఆ రెండు విభాగాల ఆఫీసర్లు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది.