సెప్టెంబర్30న కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం..సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సెప్టెంబర్30న కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం..సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  కొత్త కలెక్టరేట్  బిల్డింగ్ ను ఈ నెల 30న సీఎం రేవంత్​రెడ్డి చేతులమీదుగా పండుగ  వాతావరణంలో ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారంతో పాటు ఆఫీస్​ బిల్డింగ్​ను సుందరంగా అలంకరించాలని, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సీఎం  పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ చాంబర్​లో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్  రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. 

సీఎం కలెక్టరేట్ ను ప్రారభించాక కొత్త కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను సక్సెస్  చేయాలని సూచించారు.   

కొత్త కలెక్టరేట్​ బిల్డింగ్​ పరిశీలన

సమీక్ష అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి కొత్త కలెక్టరేట్  భవనాన్ని పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. 

కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరంతో పాటు సీఎం పర్యటించే ప్రాంతాలను, సీఎం రాక కోసం కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్​ను పరిశీలించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్  చిత్రా మిశ్రా, సీపీ గౌస్  ఆలం, మున్సిపల్  కమిషనర్  ప్రఫుల్  దేశాయ్, లైబ్రరీ చైర్మన్  సత్తు మల్లేశ్, అడిషనల్  కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు.