- కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్, వెలుగు: ముందస్తు ప్రణాళికలతో వానాకాలం సీజన్‌కు సిద్ధం కావాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖల ప్రస్తుత పరిస్థితి, రాబోయే వానాకాలం సీజన్ సన్నద్ధతపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించి, నికర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ ఆఫీసర్ లింగారెడ్డి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి విజయభారతి, ఆత్మ పీడీ చత్రునాయక్, మార్క్ ఫెడ్ డీఎం గౌరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
