- 43,105 ఫోన్ కాల్స్‌లో 22,830 కాల్స్ అలాంటివే
- వృథా అవుతున్న పోలీసుల టైం
- ఆపదలో అవసరం కోసం మరో 20,275 కాల్స్
- బాధితులకు భరోసా కల్పించిన పోలీసులు
కరీంనగర్, వెలుగు: అత్యవసర, ఆపద సమయంలో పోలీస్ సాయం కోసం ఫోన్ చేసేందుకు ఏర్పాటు చేసిన డయల్ 100కు న్యూసెన్స్ కాల్స్, రిపీటెడ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కరీంనగర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తం 43,105 కాల్స్ వస్తే అందులో 22,830 కాల్స్ న్యూసెన్స్ కు సంబంధించినవే వచ్చాయంటే.. డయల్ 100ను జనం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కాల్స్ వల్ల పోలీసుల సమయం వృథా అవ్వడమేగాక కొన్నిసార్లు ఎమర్జెన్సీ కాల్స్‌పై స్పందించడంలో ఆలస్యమవుతోందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
మహిళల నుంచి వేలల్లో కాల్స్
మహిళల భద్రత విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఒకప్పుడు వేధింపులను మౌనంగా భరించే మహిళలు, ఇప్పుడు ధైర్యంగా డయల్ 100కు కాల్ చేస్తున్నారు. గత పది నెలల్లో 5,641 మంది మహిళలు 100కు ఫోన్ చేసి తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే బ్లూకోల్ట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళలకు తక్షణ రక్షణ కల్పించడమేగాక నేరస్తులకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేయగలిగారు.
యాక్సిడెంట్స్ జరిగినా పోలీసులకే ఫోన్..
కేవలం నేరాలే కాకుండ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రజలు 108తోపాటు 100కు కాల్ చేస్తున్నారు. ఇలా 2,288 రోడ్డు ప్రమాద ఘటనల్లో పోలీసులు గాయపడినవారిని హాస్పిటళ్లకు తరలించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అలాగే ఆత్మహత్యకు యత్నించిన 561 మందిని సకాలంలో ప్రాణాలను రక్షించారు. వీటితోపాటు పర్సనల్ గొడవలకు సంధించినవి 8,754, ఆస్తి రక్షణకు సంబంధించి
3,031 కాల్స్ వచ్చాయి.
సిటీలోని ఠాణాల పరిధిలోనే 20 శాతం కాల్స్..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5,176 కాల్స్ రాగా, కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో 5,006 కాల్స్ వచ్చాయి. మొత్తం కాల్స్ లో 20 శాతం కాల్స్ ఈ రెండు స్టేషన్ల పరిధిలోనే ఉన్నాయి. అలాగే కరీంనగర్ నగర శివార్ల పరిధిగాగల కొత్తపల్లి స్టేషన్ పరిధిలో 3,803 కాల్స్, కరీంనగర్ రూరల్ స్టేషన్ పరిధిలో 3,486 కాల్స్ వచ్చాయి.
అత్యవసరమైతేనే ఫోన్ చేయండి..
ఆపదొస్తేనే 100కి కాల్ చేయండి.. పోలీసులు క్షణాల్లో మీ ముందుంటారు. కానీ అనసరమైన కాల్స్ చేయకండి. ఈ కాల్స్ వల్ల అత్యవసర ఫిర్యాదులపై స్పందనలో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. -గౌష్ ఆలం, సీపీ, కరీంనగర్
