- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లను క్లీన్ చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ పాఠశాలలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని హైస్కూల్‌ను సందర్శించి, ‘టిఫిన్ బైఠక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పరిసరాలను క్లీన్ చేసే అంశంపై చర్చించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... సర్కార్ స్కూళ్లను కాపాడుకోవడం, క్లీన్‌గా ఉంచడం మన బాధ్యత అన్నారు. స్కూల్‌లో డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్‌లో క్లాస్‌కూమ్‌ల కొరత ఉందని టీచర్లు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన డైనింగ్ కోసం రూ.5 లక్షలు, ప్రైమరీ స్కూల్‌లో క్లాస్‌రూమ్‌ల నిర్మాణానికి, కుల సంఘాల భవన నిర్మాణానికి రూ.20 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సారి కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ స్టూడెంట్లకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. తాను ఎంపీ అయ్యాక సమాజసేవకే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. శనివారం సిరిసిల్లలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించనున్నారు.
మోదీ పుష్కర పాలన ఎట్లుంది ?
రేకొండ నుంచి తిరుగు పయనం అయిన బండి సంజయ్ స్థానిక ఆటో స్టాండ్ వద్ద కొద్దిసేపు ఆగి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. దిలీప్ అనే డ్రైవర్‌ను పలకరిస్తూ... మోదీ 12 ఏండ్ల పాలన ఎట్లుందంటూ ఆరా తీశారు. రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించారు. మోదీ 12 ఏళ్ల పాలనకు సంబంధించిన పుస్తకాన్ని ఆటో డ్రైవర్‌కు అందజేశారు.
