- సర్వాయి పాపన్న స్వగ్రామం సర్వాయిపేట
- మినీ ఫంక్షన్ హాల్, ఆడిటోరియం, లాన్ ఏర్పాటు పనుల్లో జాప్యం
- సర్కార్ నిధులు ఇచ్చినా ఏడాదిన్నరగా కొనసాగుతున్న పనులు
కరీంనగర్/సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్మృతులను పదిలపరిచేందుకు ఆయన స్వగ్రామమైన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో ప్రభుత్వం రూ.4.35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. గుట్టపై ఆకర్షణీయంగా ఎత్తైన సర్వాయి పాపన్న విగ్రహం, అక్కడికి వెళ్లేందుకు గ్రానైట్ తో మెట్ల దారి పూర్తయినయిప్పటికీ.. మిగతా పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, పనులు ప్రారంభించి ఏడాదిన్నరయినా వాటిని కంప్లీట్ చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలున్నాయి.
సర్వాయిపేటకు మహర్దశ..
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వగ్రామం సర్వాయిపేటను టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని రెండేళ్ల కింద పాపన్న జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వాయిపేటలో సర్వాయి పాపన్న నిర్మించిన కోటతోపాటు ఆ గ్రామంలో వసతుల కల్పన కోసం మొదటి విడతలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.4.70 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పాపన్న విగ్రహం పనులు పూర్తి.. మిగతావి పెండింగ్
మొగల్ సుల్తాన్లపై తిరుగుబాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్వాయిపేట శివారు గుట్టలపై 1675లో నిర్మించిన కోట ఇప్పటికీ ఉంది. కోట నిర్మించడం వల్ల ఈ గుట్టలను కోటగిరిగట్లుగా పిలుస్తున్నారు. టూరిజం అభివృద్ధి పనుల్లో భాగంగా కోటగిరిగట్లులోని మొదటి గుట్టపై ఎత్తైన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
గుట్టపైకి వెళ్లేందుకు అనువుగా మెట్లదారి నిర్మించారు. ఈ గుట్ట కింది భాగంలోని రెండెకరాల స్థలంలో ఆడిటోరియం, ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారు. వీటి పనులు మాత్రం ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. లాన్, పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులేవి ఇంకా ప్రారంభం కాలేదు.
