కరీంనగర్ భూకబ్జాల దందాలో కదులుతున్న డొంక

కరీంనగర్ భూకబ్జాల దందాలో కదులుతున్న డొంక
  •  ప్రజల నుంచి 750 ఫిర్యాదులు
  • ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అరెస్ట్​
  • కబ్జాలకు సహకరించిన ఆఫీసర్లపైనా సర్కారు ఫోకస్ 
  • తాజాగా తహసీల్దార్​ను ఏ9గా చేరుస్తూ నోటీసులు 
  • లిస్టులో మరికొందరు పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు 

కరీంనగర్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జరిగిన భూకబ్జాలు, చీటింగ్, బెదిరింపుల కేసుల్లో పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. కబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంతోపాటు వారికి సహకరించిన పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల పాత్రపైనా దృష్టి సారించారు. ఇటీవలి ఓ భూకబ్జా కేసులో గతంలో కొత్తపల్లి తహసీల్దార్ గా పని చేసిన చిల్ల శ్రీనివాస్ (ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్నారు)ను ఏ9గా చేర్చి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇవ్వడంతో మిగతా రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లలో వణుకు పుడుతున్నది. 

 దీంతో అప్పట్లో బీఆర్ఎస్ నాయకుల అండతో పోస్టింగ్స్ పొందడమేగాక వారికి జీ హుజూర్ అంటూ బాధితుల గోడును సైతం పట్టించుకోకుండా కబ్జాలకు సహకరించిన ఆఫీసర్లను ఇప్పుడు కేసుల భయం వెంటాడుతోంది.   

ఫిర్యాదుల్లో ఆఫీసర్ల పేర్లు.. 

కరీంనగర్ కమిషనరేట్ లో ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనన్ని భూకబ్జాలు, ప్లాట్లు అమ్ముతామంటూ లక్షల్లో అడ్వాన్స్ తీసుకుని ఎగ్గొట్టడం, నకిలీ పత్రాలతో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ఆక్రమణలు, బెదిరింపుల్లాంటి ఘటనలు జరిగాయి. కమిషనరేట్ వ్యాప్తంగా బాధితుల నుంచి ఇప్పటికే 750 ఫిర్యాదులు అందగా.. ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్(ఈఏడబ్ల్యూ)తోపాటు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలు ఎంక్వైరీ చేస్తున్నారు. 

ఇవే ఫిర్యాదులను బాధితులు అప్పట్లో పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఇస్తే నాటి సీఐలు, ఏసీపీలు వారి గోడును పట్టించుకోకపోగా.. కబ్జాదారులకే వత్తాసు పలికారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారి పేర్లను బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొంటున్నట్లు తెలిసింది. అప్పట్లో కొత్త రాజిరెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి తన భూమి కబ్జాకు గురైందని అప్పటి వన్ టౌన్ సీఐ నటేష్ కు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని తెలిసింది.

 జగిత్యాల టౌన్ సీఐగా పని చేస్తున్న ఆయనపై అవినీతి కేసులో ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. నటేష్ పై వచ్చిన ఆరోపణల్లో కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని భూకబ్జాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నకిలీ పేపర్లతో ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్ కావడానికి సహకరించిన అప్పటి కొత్తపల్లి తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ పైనా కేసు నమోదైంది. 

ఏండ్లుగా కరీంనగర్ లోనే పోస్టింగ్.. 

కొందరు పోలీస్ ఆఫీసర్లు ఎస్సై నుంచి ఏసీపీ అయ్యే వరకు ఇక్కడే పోస్టింగ్స్ పొందడం, మరికొందరు ఎస్సైలు, సీఐలు ఈ కమిషనరేట్ లోనే లా అండ్ ఆర్డర్ లోనే డ్యూటీ చేసేందుకు పైరవీలు చేసుకోవడం వెనక భూవివాదాల్లో వచ్చే కమీషన్లు, ఆర్థికపరమైన వివాదాల్లో జరిగే సెటిల్మెంట్లే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కొందరు పది, పదిహేనేండ్లుగా కరీంనగర్ ను వదల్లేదని తెలిసింది. 

వీరంతా భూ మాఫియాకు పూర్తి సహకారం అందించి, బాధితులను ముప్పుతిప్పలు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కొందరు వీఆర్వోలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు భూరికార్డులను తారుమారు చేసి కబ్జాదారులకు సహకరించారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే కొందరు రెవెన్యూ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగానే సంబంధం లేనివారికి భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వివాదాలన్నీ వారికి రూ.కోట్లు కురిపించాయి. ఇలాంటి పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఉన్నతాధికారులు ఇప్పుడు వారి అక్రమాలపై రిపోర్టులు రెడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతుండడం రెవెన్యూ, పోలీస్​శాఖలో కలకలం రేపుతోంది.  

12కు చేరిన అరెస్టులు..

కరీంనగర్ సిటీ భూకబ్జాల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. స్థానిక భగత్ నగర్ లోని కొత్త రాజిరెడ్డికి చెందిన భూకబ్జా కేసులో బీఆర్ఎస్ నాయకుడు చీటీ రామారావు, 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు, నిమ్మశెట్టి శ్యాంతో మొదలైన అరెస్టుల పర్వం ఇప్పటివరకు 12కు చేరింది. నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లను కూల్చి అక్రమంగా భూకబ్జాకు పాల్పడిన ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావును, భూకబ్జాకు పాల్పడిన 21వ డివిజన్(సీతారాంపూర్) కార్పొరేటర్ జంగిలి సాగర్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి భూఆక్రమణకు పాల్పడిన తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ ను అరెస్ట్ చేశారు. 

అలాగే రేకుర్తికి చెందిన భూమిని నకిలీ పేపర్లను నిజమైనవని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.37 కోట్లు వసూలు చేసి మోసగించిన 17వ డివిజన్  కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్, 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుదగోని కృష్ణ గౌడ్, ఏలేటి భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ పేపర్లతో అక్రమంగా భూకబ్జాకు పాల్పడిన కేసులో బీఆర్ఎస్ నాయకుడు నందెళ్లి మహిపాల్, మాజీ సర్పంచ్ గంగాధర కనకయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.