
- ఇంటర్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్
- ఈ నెలాఖరులోగా పది రకాల సేవలు అందుబాటులోకి
- ఏర్పాట్లు చేస్తున్న బోర్డు అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో పనిచేసే ఎంప్లాయీస్ కోసం ఆన్ లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎంప్లాయీస్ వర్క్‌ను ఈజీ చేసే లక్ష్యంతో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఆర్ఎస్) పోర్టల్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం రెండు రకాల సేవలు అందుబాటులోకి రాగా.. ఈ నెలాఖరులోగా పది రకాల సేవలను ఎంప్లాయీస్కు అందించనున్నారు.
స్టేట్‌లోని 430 సర్కారు జూనియర్ కాలేజీల్లో 9వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఫేషియల్ అటెండెన్స్ విధానం ఇటీవలే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వీరితో పాటు డీఐఈఓ, జిల్లా నోడల్ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది కూడా ఆన్లైన్ సెలవులను ఇంటర్ బోర్డు అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సర్కారు కాలేజీల్లో హెచ్ఎంఆర్ఎస్ పోర్టల్ లో ప్రస్తుతం లీవ్స్, ఎన్ఓవీలు ప్రారంభించారు.
ఎంప్లాయీస్ ఎవరైనా లీవ్స్ తీసుకోవాలంటే.. ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ అప్రూవల్/ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. లీవ్స్లోనూ స్పెషల్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, ఈఎల్స్, ఆఫ్ పే లీవ్స్.. ఇలా సబ్ కేటగిరీల ఆధారంగా లీవ్స్ తీసుకునే అవకాశం కల్పించారు. దీనికితోడు ఇతర దేశాలకు వెళ్లేందుకు, పాస్ పోర్టు, ఉన్నత చదువులతో ఇతర అవసరాల కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా ఆన్లైన్లో అప్లై చేసి పొందే అవకాశం కల్పించారు. ఇవన్నీ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి.
మరిన్ని సేవలు ఆన్లైన్..
ఎంప్లాయీస్ కు సంబంధించిన కీలకమైన సేవలు ఆన్ లైన్లోనే చేయాలని ఇంటర్మీడియెట్ అధికారులు చర్యలు ప్రారంభించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్స్నూ ఆన్లైన్లో అప్లోడ్ చేసి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంక్రిమెంట్లు, సర్వీస్ హిస్టరీ పోర్టల్‌లో ఉండనున్నది. జీపీఎఫ్, జీఐఎస్, సీపీఎస్ వంటి ఫైనాన్స్ వివరాలు ఇక్కడే తెలుసుకునే అవకాశం ఉంది. రిటైర్ మెంట్ పొందిన ఎంప్లాయీస్ కు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రమోజనాలను మాడ్యుల్ ద్వారా నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్లు, సర్వీస్ హిస్టరీ వివరాలతో పాటు ఎంప్లాయీస్ పై తీసుకున్న క్రమశిక్షణ చర్యల డేటా తీసుకునే చాన్స్ ఉంది.