
ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాల్లో జాతి వివక్ష, జాతి అహంకారం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు వలసవాదులకు ఆహ్వానం పలికిన దేశాలు నేడు నో ఎంట్రీ అంటున్నాయి. దీనికి ఆర్థిక సమస్యలు, నేరాలు, జాతీయవాద భావాలు, ఉపాధి లేమి, ఆయా దేశాల్లో పెరుగుతున్న జనాభా, రాజకీయ కారణాలు ఈ వలసలకు వ్యతిరేకంగా నిలిచాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర కోసం కృషి చేసిన దేశం, వివిధ దేశాలకు స్నేహ హస్తం అందించిన దేశం, శాంతిస్థాపనకు శాంతి పరిరక్షణ సైన్యాన్ని పంపించిన మన దేశం నేడు అమెరికా, కెనడా, బ్రిటన్, మధ్య ప్రాచ్య దేశాల్లో ద్వేషపూరిత దాడులు, వివక్షకు గురి అవుతున్నది.
భారతీయులపై జాతి వివక్ష
యూఏఈ, సౌదీ, ఖతార్లో భారతీయ కార్మికులు, అమెరికా, బ్రిటన్, కెనడాలోని భారత ప్రవాసీయులు జాతి వివక్షను అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని భారతీయ ప్రవాసీల సంఖ్య 2024 నాటికి సుమారు 35.42 మిలియన్ మంది ఉన్నారు. 2024లో భారత వలసవాదుల సంఖ్య అమెరికాలో సుమారుగా 54 లక్షలు, బ్రిటన్ 18.6 లక్షలు, సౌదీ అరేబియా 24.6 లక్షలుగా ఉన్నారు. ఈ తరుణంలో కొన్ని దేశాలు వారి అతి జాతీయ భావం, అభద్రతా భావంతో.. యూఎన్ఓ, ప్రపంచీకరణ సూత్రాలకు విరుద్ధంగా జాతి వివక్ష సంఘటనలు జరుగుతున్నాయి.
మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా
మొన్న అమెరికా, నిన్న కెనడా, నేడు ఆస్ట్రేలియా, బ్రిటన్ భారతీయుల వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో ఆగస్టు 31, 2025 నాడు ఆస్ట్రేలియాలోని సుమారుగా 20 మహానగరాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇది ముఖ్యంగా అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసన. సుమారుగా పదివేల మంది నిరసనతో సిడ్నీ దద్దరిల్లింది. దీంతో ఆస్ట్రేలియా మొత్తంలో భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా ప్రపంచ మీడియా భావిస్తోంది. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 2.72 కోట్ల కాగా, 31% మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన పౌరులే ఉన్నారు. ఇందులో యూకే మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండో స్థానంలో ఉంది. భారతీయ జనాభా 2024 నాటికి 9 లక్షలకు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియాలోని భారతీయుల జనాభా కేవలం 3.2% మాత్రమే.
ఆహ్వానిస్తున్న ఐర్లాండ్
యూరప్ దేశాలు జాతి అహంకారం ప్రదర్శిస్తుంటే అదే యూరప్ దేశమైన ఐర్లాండ్ మాత్రం దీనికి భిన్నంగా ఇతర జాతీయులను ఐర్లాండ్లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరచుకునేందుకు ఆహ్వానిస్తోంది. ఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్ టర్మ్ రెసిడెన్సీ అని అంటారు. ఈ విధానం ద్వారా ఇతర పౌరులు ఐర్లాండ్లో నివాసం ఉండేందుకు అనుమతి ఇచ్చే విధానం. ఆ దేశ పౌరసత్వం మాత్రం రాదు. కానీ, ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా పని చేసుకునే హక్కు, ప్రజలకు సేవలందించే అవకాశం కల్పిస్తోంది. అయితే శాశ్వత రెసిడెన్సీని పొందాలంటే మాత్రం ఐర్లాండ్లో సుమారుగా ఐదు సంవత్సరాలు చట్టపరమైన నివాసం ఉండాలి.
బలమైన దౌత్య నీతి అవసరం
ప్రతి మనిషి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందాల్సిన హక్కు కలిగినవాడే. జాతి, వర్ణం, మతం, భాష అనే భేదాలు మనిషి విలువను నిర్ణయించవు. కాబట్టి, జాతి అహంకారాన్ని నిర్మూలించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవతా విలువలతో ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మానవ వనరులు అధికంగా ఉన్న భారతదేశం ప్రపంచానికి చాలా అవసరం. ఇతర దేశాల్లో భారతీయు లకు ఎదురవుతున్న జాత్యహంకారం పట్ల కేంద్రం కట్టుదిట్టమైన దౌత్య వ్యవహారాలను నడపాల్సిన అవసరం మాత్రం ఉంది.
- డా. కంకాల ఎలేందర్,
పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ,
ఓయూ