తొలి విడత పోరుకు నామినేషన్ల స్వీకరణ షురూ

 తొలి విడత పోరుకు నామినేషన్ల స్వీకరణ షురూ
  • సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ 
  • మొదటి రోజు గ్రామాల్లో ఒకటి, రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు

 కరీంనగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌‌ను అనుసరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి దశలో డిసెంబర్ 11న ఎన్నికలు జరిగే సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆయా స్థానాల్లో వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు స్వీకరించారు. నామినేషన్లు వేసేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు వారిని బలపరిచే ఓటర్లు కూడా తమ ఇంటి పన్ను, ఇతర పన్నులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. 

అలాగే అభ్యర్థి రిజర్వుడ్ కేటగిరీలో పోటీ చేస్తే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించడంతోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్లు అందక నామినేషన్ల దాఖలు మొదటిరోజు గురువారం మందకొడిగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో గ్రామంలో ఒకటి, రెండు మినహా నామినేషన్లు దాఖలు కాలేదు. కొన్ని చోట్ల ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. 

కరీంనగర్ జిల్లాలో 93 నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలోగంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో తొలి విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలోని 92 సర్పంచ్,  866 వార్డు మెంబర్ల స్థానాలకు తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. 92 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 93 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండి మండలంలోని 16 పంచాయతీల్లో 15 నామినేషన్లు, గంగాధరలోని 33 జీపీల్లో 29, రామడుగులోని 23 జీపీల్లో 27, కరీంనగర్ రూరల్ లోని 14 జీపీల్లో 10, కొత్తపల్లిలోని 6 జీపీల్లో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. 

రామడుగు మండలం వెదిర జీపీ ఆఫీసులో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. 

జగిత్యాల జిల్లాలో 48 నామినేషన్లు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మొదటి విడతలో కోరుట్ల, మెట్‌‌పల్లి డివిజన్ లోని 122 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 48, వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్ తెలిపారు. భీమారం మండలంలో 10, కథలాపూర్ లో 13, మల్లాపూర్ లో 6, కోరుట్ల లో 6, మెట్ పల్లి 8, ఇబ్రహీంపట్నం 5 అభ్యర్థులు నామినేషన్లు  వేశారు. 

రాజన్న సిరిసిల్లలో 42.. 

రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలోని మండలాల్లో తొలి విడత పోలింగ్ జరిగే వేములవాడ అర్బన్ మండలంలో 2, రూరల్ మండలంలో 7, చందుర్తి మండలంలో 13, రుద్రంగి మండలంలో 4, కోనరావుపేట మండలంలో 16 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 85 జీపీల్లో తొలి రోజు సర్పంచ్ స్థానానికి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. 748 వార్డులకు గానూ కేవలం 32 నామినేషన్లు దాఖలయ్యాయి. 

పెద్దపల్లిలో 103.. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌‌పూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పంచాయతీల్లో గురువారం నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైంది. మంథని మండలంలో 36, ముత్తారంలో 8, రామగిరిలో 9, కమన్‌‌పూర్ లో 16, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 34 కలిపి మొత్తం 103 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు 44 నామినేషన్లు వేశారు.