బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బీసీని సీఎం చేయగలరా? : బండి సంజయ్‌

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బీసీని సీఎం చేయగలరా? : బండి సంజయ్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం అన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్.  బీఆర్ఎస్ రెండో స్థానమో, మూడో స్థానమో తేల్చుకోవాలన్నారు. తాను ఏనాడు భూములు కబ్జా చేయలేదని, అరాచక శక్తులను, దొంగ దందాలు చేసే వాళ్లను చేరదీయలేదని చెప్పారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలకు కమీషన్లు ఇస్తే తప్ప భూములకు రక్షణకు లేదన్నారు. ఇలాంటి వారికి కరీంనగర్ ప్రజలు నవంబర్ 30న గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పారు. తనను ఓడించేందుకు రూ.500 నుంచి వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ అంబేద్కర్ నగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 
 
తనను అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో తాను సమాజాన్ని ఒక్కటి చేశానని.. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ప్రమాదమని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ కుమారుడు కాకపోతే కేటీఆర్ ను ఎవరూ పట్టించుకునే వారు కాదన్నారు. కేటీఆర్ అహంకారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ వేస్తామంటున్న కేటీఆర్.. ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ సమస్యను చిన్న సమస్య అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :- పవర్ ప్లాంట్​లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం

నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ పరిపాలనలో పడ్డ ఇబ్బందులను నిరుద్యోగులు, యువతీ, యువకులు ఎవరూ మర్చిపోవద్దని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. నిరుద్యోగుల కోసం కొట్లాడి.. జైలుకు పోయిన తమను మరిచిపోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వయోపరిమితిని సవరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నాయన్నారు.  బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా..? లేదంటే గతంలో ప్రకటించినట్లుగా ఎస్సీని సీఎం చేస్తారా...? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ అప్పుల తెలంగాణగా చేశారని ఆరోపించారు. కేంద్ర నిధులను దారి మళ్లించి పుట్టే బిడ్డలపై కూడా అప్పుల భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. 

కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం ఇది 
రజాకార్ల పాలనకు, రామరాజ్య స్థాపనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది
కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా..? బాబా సాహేబ్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? 
ప్రజలు ఏది కావాలో ఆలోచించండి అని కోరారు.