కరీంనగర్ : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​నడుమ త్రిముఖ పోరు

 కరీంనగర్ : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​నడుమ త్రిముఖ పోరు

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​నడుమ త్రిముఖ పోరు

కరీంనగర్‍, వెలుగు: హైదరాబాద్, వరంగల్ తర్వాత రాష్ట్రంలో మూడో అతి పెద్ద సిటీ కరీంనగర్. సుమారు 3.5 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్​లో 60 డివిజన్లు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి మేయర్ పదవి రిజర్వ్ అయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​నడుమ త్రిముఖ పోరు కనిపిస్తోంది. ప్రధానంగా పలు డివిజన్లలో టీఆర్ఎస్​, బీజేపీ నడుమ పోటీ నువ్వా.. నేనా? అన్నట్లుగా పోటీ ఉంది. టీఆర్ఎస్ క్యాడర్​కు మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ క్యాడర్​కు ఎంపీ బండి సంజయ్ సారథ్యం వహిస్తుండడం, వారిద్దరూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తుండడంతో ఇక్కడ ఎన్నికలపై అంతటా ఆసక్తి నెలకొంది.

58 డివిజన్లు.. 159 మంది ఇండిపెండెంట్లు

మొత్తం 60 డివిజన్లలో రెండు  ఏకగ్రీవం అయ్యాయి. 58 డివిజన్లకే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్ల కంటే రెండు రోజులు ఆలస్యంగా ఇక్కడ  నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసే సమయానికి  363 మంది బరిలో ఉన్నారు. బీజేపీ 53 డివిజన్లలో, టీఆర్ఎస్ 58 డివిజన్లలో, కాంగ్రెస్ 50 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. ఇండిపెండెంట్లు 159 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం సీపీఐతో  పొత్తు పెట్టుకొని, ఆ పార్టీకి  రెండు సీట్లు ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటం, పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో కొంత ఆలస్యం చేశాయి. తర్వాత నేతలే బీ ఫాంలు అందించారు. ఇటు మంత్రి గంగుల కమలాకర్, అటు బండి సంజయ్ రంగంలోకి దిగి.. నామినేషన్లు వేసిన కొందరిని బుజ్జగించారు.

గత ఎన్నికల్లో ఇలా..

కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక ఇవి మూడో ఎన్నికలు. 2014లో 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 24 డివిజన్లలో టీఆర్ఎస్,14 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించాయి. రెండు డివిజన్లను బీజేపీ, రెండు డివిజన్లను ఎంఐఎం, ఒక డివిజన్​ను సీపీఐ గెలుచుకోగా, ఏడు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. మేయర్ పీఠం బీసీ జనరల్​కు రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్​కు సన్నిహితులైన గుగ్గిళ్ల రమేశ్, చల్లా హరిశంకర్ పోటీపడ్డారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ ఆశీస్సులతో సర్దార్ రవీందర్ సింగ్ మేయర్ పీఠమెక్కారు.

మేయర్ సీటు చాలా హాటు

కరీంనగర్ మేయర్ పీఠం జనరల్​కు రిజర్వ్ కావడంతో హాట్ సీట్​గా మారింది. ఆశావహుల లిస్టు పెద్దదే ఉంది. అధికార పార్టీలో మొదటి నుంచి వై.సునీల్ రావు పేరు వినిపించింది. ఈయనకు పోటీగా మంత్రి గంగుల కమలాకర్ తన ముఖ్య అనుచరుడు వంగపెల్లి రాజేందర్ రావును బరిలో నిలిపారు. వీరిద్దరూ నామినేషన్లు వేసి, పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా నామినేషన్ వేశారు. ఆయన కూడా మేయర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా రవీందర్​సింగ్​కు పేరుంది. మంత్రి మాత్రం రవీందర్​ను మరోసారి మేయర్​​గా ఒప్పుకోరని పార్టీ వర్గాల టాక్. వీరిద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ ఇద్దరికీ నచ్చజెప్పి, కలిసి పని చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మల్లికార్జున రాజేందర్ కూడా మేయర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఆశావహులు చాలా మందే ఉన్నా, ఎవరి పేర్లూ బయటకు రావడం లేదు. ఇక కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత ప్యాట రమేశ్‍ ను ఇప్పటికే ప్రకటించింది.

మూడు పార్టీలు.. హోరాహోరీ పోరు

కరీంనగర్ కార్పొరేషన్​లో పోలింగ్​కు ముందే టీఆర్ఎస్ బోణీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు చల్లా స్వరూపరాణి (37వ డివిజన్​), రాజేశ్వరి (20 వ డివిజన్​) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 58 డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాయి. మంత్రి గంగుల, ఎంపీ సంజయ్.. కార్పొరేషన్​పై తమ జెండా ఎగరవేయాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను బాగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్​ క్యాడర్​కు కమలాకర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను బండి సంజయ్ ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. తమను గెలిపిస్తే కేంద్రం సాయంతో నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా చూస్తానని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎన్నికల సారథ్యం వహిస్తున్నారు. సీపీఐతో పొత్తు
పెట్టుకుని పోటీ చేస్తున్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి