కూకట్ పల్లిలో పెండ్లయిన 2 నెలలకే సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్

కూకట్ పల్లిలో పెండ్లయిన 2 నెలలకే సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్

కూకట్ పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీ పోలీస్​స్టేషన్​ పరిధిలో పెండ్లయిన 2 నెలలకే ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వడిగినేని చైతన్య(35), నాగమౌనిక(31)కు గత ఏప్రిల్ లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారు కేపీహెచ్​బీ కాలనీ ఏడో ఫేజ్​ ఎల్ఐజీ 43లో నివసిస్తున్నారు. ఆషాఢమాసం కావడంతో మౌనిక గత నెల 21న పుట్టింటికి వెళ్లింది. చైతన్య ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు.

మౌనిక రోజూ భర్తతో ఫోన్​లో మాట్లాడుతుండేది. సోమవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. ఆ సమయంలో చైతన్య డల్​గా మాట్లాడి, ఫోన్​ పెట్టేశాడు. ఆ తర్వాత 11 గంటల నుంచి మౌనిక పలుమార్లు ఫోన్​ చేసినా అతను లిఫ్ట్​ చేయలేదు. అనుమానం వచ్చి, ఆమె తన మామయ్యకు ఫోన్​చేసి సమాచారం ఇచ్చింది. అతను వెళ్లి తలుపు కొట్టినా తియ్యకపోవడంతో పగులగొట్టి లోపలకు వెళ్లి చూశాడు. అప్పటికే చైతన్య ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్​మార్చురీకి తరలించారు. చైతన్య జీవితంపై విరక్తితో సూసైడ్​చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని,  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.