అద్దె బిల్డింగ్​లో మున్సిపల్ ​ఆఫీస్​

అద్దె బిల్డింగ్​లో మున్సిపల్ ​ఆఫీస్​
  • 2016లో భవన నిర్మాణానికి మినిస్టర్​ కేటీఆర్ ​భూమి పూజ
  • రూ.5.85 కోట్లతో కొత్త డీపీఆర్ ఫైనల్
  • రెండు టర్మ్ లు పూర్తవుతున్నా ప్రారంభం కాని పనులు
  • పార్కింగ్ కోసమే లేట్ అంటున్న ఆఫీసర్లు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఆఫీస్​బిల్డింగ్ నిర్మాణం ఆరేండ్లయినా ముందుకు సాగడం లేదు. కొత్త డీపీఆర్ కు రూ. 5.85 కోట్లతో ఆమోదం లభించినా పార్కింగ్ స్థలం లేకుండా బిల్డింగ్ కడితే ఎలా అని మున్సిపల్​అధికారులు, స్థానిక లీడర్లు పేర్కొనడంతో నిర్మాణం ఆగిపోయింది. అనంతరం మున్సిపాలిటీ క్యాంపస్​లో ఉన్న ఆర్ అండ్ బీ, లైబ్రరీ బిల్డింగ్​లను కూల్చేసి, ఆ స్థలాన్ని కూడా తీసుకుంటే పార్కింగ్​కు ఇబ్బంది ఉండదని స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు ప్రపోజల్ తీసుకొచ్చి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, విద్యాశాఖకు నివేదించారు.

ఆరేండ్ల కింద శంకుస్థాపన..

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాల్టీగా అప్ గ్రేడ్ చేశారు. అనంతరం మున్సిపల్ బిల్డింగ్​కోసం 2016 ఏప్రిల్​లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. నిర్మాణం కోసం అధికారులు రూ.3.85 కోట్లతో డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. నాటి సర్కార్ ఆమోదించడంతో  ఆగమేఘాల మీద మున్సిపాలిటీ సిబ్బంది పాత బిల్డింగ్​ను కూల్చి వేశారు. అయితే మున్సిపల్ పాలకవర్గానికి, ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డికి పడకపోవడంతో బిల్డింగ్ విషయంలో సాగదీత మొదలైంది. ఈలోపు 2018 ఎన్నికలొచ్చాయి. ఎమ్మెల్యేగా మరోసారి మనోహర్ రెడ్డి గెలిచి కొత్త మున్సిపల్ పాలకవర్గం కూడా ఏర్పాటైంది. ఆ పాలకవర్గంలో పాత వారెవరూ లేకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడి మున్సిపల్ చైర్ పర్సన్​గా తన కోడలు మమతారెడ్డిని ఏకగ్రీవం చేశారు. ఈ క్రమంలో బల్దియా బిల్డింగ్ నిర్మాణం రెండోసారి తెర మీదికొచ్చింది. పాత డీపీఆర్ ని రద్దు చేసి 2021లో దాదాపు రూ.7 కోట్లతో కొత్త డీ పీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. రూ.3.85 కోట్లతో ఉన్న డీపీఆర్ రూ. 7 కో ట్లకు చేరుకోవడాన్ని పాత పాలకవర్గం లీడర్లు, ప్రతిపక్షాలు తప్పుబట్టడంతో ప్రభుత్వం డీపీఆర్ ను రిజెక్ట్ చేసింది. అనంతరం రూ.5.85కోట్లతో మరోసారి డీ పీఆర్ పంపించారు. దీన్ని సర్కార్ ఆమోదించింది. 

ఫండ్ లేకనే సాగదీస్తున్నారా..?

మున్సిపల్ బిల్డింగ్​ నిర్మాణానికి కాంట్రాక్టు అప్పగించినా పనులు ప్రారంభం కావడంలేదని, నిధులన్నీ ఇతర పనులకు మళ్లిస్తున్నారని ఇటీవల ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఎలాంటి తీర్మానాలు లేకుండా ఎమ్మెల్యే మున్సిపాలిటీపై నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ అభివృద్ధి పనిచేయడానికి కూడా ఫండ్స్ లేవని తెలుస్తోంది.