‘మెటా ఫండ్‌‌’ కేసులో.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌‌

‘మెటా ఫండ్‌‌’ కేసులో.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌‌
  • ఆస్తి పత్రాలు, 30 తులాల బంగారం, ఫోన్లు, బీఎండబ్ల్యూ కారు స్వాధీనం

కరీంనగర్‌‌ క్రైం, వెలుగు : ‘మెటా ఫండ్‌‌’ యాప్‌‌ పేరుతో ప్రజల నుంచి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్‌‌రావును కరీంనగర్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌష్‌‌ ఆలం గురువారం వెల్లడించారు. హైదరాబాద్‌‌లోని మల్కాజ్‌‌గిరికి చెందిన వరాల లోకేశ్వర్‌‌రావుకు సాఫ్ట్‌‌వేర్‌‌ అప్లికేషన్ల తయారీలో నైపుణ్యం ఉంది. 

ఈ క్రమంలోనే అతడు కరీంనగర్‌‌కు చెందిన తులసి ప్రకాశ్‌‌, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్‌‌, మాజీ కార్పొరేటర్‌‌ కట్ల సతీశ్‌‌తో కలిసి ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్‌‌ చేశాడు. ఇందులో భాగంగా ‘మెటా ఫండ్’ పేరుతో ఆన్‌‌లైన్‌‌ యాప్‌‌, కాయిన్స్‌‌ను సృష్టించాడు. ఇందులో రూ. 90 వేలు పెట్టుబడి పెడితే వెయ్యి కాయిన్లు ఇస్తామని, నెల రోజుల్లోనే మూడు రెట్ల లాభంతో కాయిన్స్‌‌ను అమ్ముకోవచ్చని ప్రజలను నమ్మించాడు. 

పెట్టుబడి పెట్టిన వారిని రిసార్ట్‌‌లు, గోవా, విదేశీ ట్రిప్‌‌లకు సైతం తీసుకెళ్లారు. తర్వాత వారి నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకొని ఆన్‌‌లైన్‌‌లో నకిలీ ఐడీలు, కాయిన్లను కేటాయించారు. యాప్‌‌లో డబ్బులు కనిపిస్తున్నప్పటికీ విత్‌‌డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా ప్లాన్‌‌ చేశారు. చివరికి యాప్‌‌ను తొలగించి పరార్‌‌ అయ్యారు. దీంతో పలువురు బాధితులు కరీంనగర్‌‌ రూరల్, కరీంనగర్‌‌ టూ టౌన్‌‌ పోలీస్‌‌ స్టేషన్లలో ఫర్యాదు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. 

విచారణ చేపట్టిన పోలీసులు తులసి ప్రకాశ్‌‌, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్‌‌, కట్ల సతీష్‌‌ను గతంలోనే అరెస్ట్‌‌ చేయగా.. ప్రధాన నిందితుడైన వరాల లోకేశ్వర్‌‌రావును బుధవారం రాత్రి అలుగునూరు ఎల్ఎండీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌‌లు, బీఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.