ఆర్టీసీ దసరా ఆదాయం ఢమాల్

ఆర్టీసీ దసరా ఆదాయం ఢమాల్
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుడు రూ.31 కోట్లు వస్తే ఈసారి రూ. 21 కోట్లే
  • నిరుటితో పోలిస్తే రూ.10 కోట్లు తగ్గిన ఆదాయం
  • పండుగ రద్దీకి అనుగుణంగా ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ ఆఫీసర్లు విఫలం

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ ఆదాయం ఢమాల్ అయింది.  ఆర్టీసీ రీజినల్ ఆఫీసర్లు, డిపో మేనేజర్ల ప్లానింగ్, పర్యవేక్షణ లోపంతో నిరుటితో పోలిస్తే ఇన్ కం భారీగా తగ్గింది. స్పెషల్ సర్వీసులు నడిపినా,చార్జీలు పెంచినా అనుకున్నంత ఆదాయం రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈసారి కరీంనగర్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ బస్సులు, అదనపు చార్జీల విధింపుతో కేవలం అదనంగా రూ.4.80 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. స్పెషల్ సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపి నిరుడు పండుగ సీజన్ లో రూ.31.49 కోట్లు వస్తే.. ఈసారి రూ.21 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నిరుడితో పోలిస్తే ఏకంగా రూ.10.49 కోట్ల(32 శాతం) ఆదాయం తగ్గింది. 

30 శాతం తగ్గిన ప్రయాణికులు.. 

కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్ - 1, కరీంనగర్ -2,  గోదావరిఖని, సిరిసిల్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, జగిత్యాల, వేములవాడ, మంథని, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోలు ఉండగా.. నిరుడు, ఈ ఏడాది వరుసగా అత్యధిక ఆదాయం సముపార్జనలో గోదావరిఖని డిపో ముందు వరుసలో నిలిచింది. అయితే నిరుటితో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య భారీగా తగ్గింది. నిరుడు దసరా సీజన్ లో(14 రోజులు) 61.18 లక్షల మంది ప్రయాణిస్తే.. ఈ పండుగ సీజన్ లో(16 రోజులు) మొత్తం 43 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాకపోకలు సాగించిన వారి సంఖ్య నిరుడితో పోలిస్తే 18.18 లక్షల మంది(30 శాతం)కి తగ్గింది.  నిరుడు 42.34 లక్షల మంది మహిళలు(మహాలక్ష్మి టికెట్లు) బస్సుల్లో రాకపోకలు సాగిస్తే ఈ సారి రూ28 లక్షల మంది మాత్రమే 
ప్రయాణించారు. 

ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లు ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాస్తవానికి విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన సెప్టెంబర్ 21 నుంచే బస్టాండ్లలో రద్దీ పెరిగింది. సద్దుల బతుకమ్మకు ముందు కూడా మహిళలు, పిల్లలు లక్షలాది మంది రాకపోకలు సాగించారు. దసరాకు ఒక రోజు ముందు, దసరా తర్వాత లక్షల్లో జనం ప్రయాణాలు చేశారు. అయితే నిరుడితో పోలిస్తే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం, డిమాండ్ ఉన్న రూట్లకు బస్సులు నడపడంలో ఆఫీసర్లు ఫెయిలైనట్లు తెలుస్తోంది. 

బస్ స్టేషన్లలో రద్దీ, బస్సుల కొరత మూలంగా చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం కనిపించింది. అందుకే ప్రయాణికుల సంఖ్య నిరుడితో పోలిస్తే 30 శాతం తగ్గిందని.. ఆదాయం కూడా అదే స్థాయిలో 32 శాతం(రూ.10.49 కోట్లు) 
తగ్గిందనే వాదన వినిపిస్తోంది.