కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత 20 రోజులుగా మోగిన మైక్‌సెట్లు, లౌడ్‌స్పీకర్లు మూగబోయాయి. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. మే 10వ తేదీన బుధవారం కన్నడ ఓట్లరు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కన్నడ ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి మరోసారి అధికారం దక్కదని తేల్చిచెప్పాయి. 1985 నుంచి కర్ణాటకలో ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం దక్కలేదు. దీంతో బీజేపీలో గుబులు నెలకొంది.
హోరా హోరీ ప్రచారం..
అధికారంలో ఉన్న బీజేపీ .. మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ముఖ్యమైన నేతలు ప్రచారం నిర్వహించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మల్లికర్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, కుమార స్వామి, దేవేగౌడ వంటి అగ్రనేతలు ముమ్మరంగా క్యాంపేయిన్ చేశారు. రెండు పార్టీలు మెనిఫెస్టో ప్రకటించారు. అనేక ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2613 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఎన్నికలు జరగనున్నాయి.