
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజును జీతంతో కూడిన సెలవు దినంగా పాటించాలని గోవా ప్రకటించింది. ఇది ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక కార్మికులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. గోవా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. గతేడాది గోవాలో పోలింగ్ రోజున కర్ణాటకలో సెలవు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు.
ప్రమోద్ సావంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కొన్ని పారిశ్రామిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సెలవుపై న్యాయపరంగా పోరాడవచ్చని గోవా స్టేట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ చెప్పింది. గోవా రాష్ట్ర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు దామోదర్ కొచ్కర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న "అసంబద్ధ" నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించారు. "గోవాలోని పరిశ్రమలు ఇది పూర్తిగా అసంబద్ధమైన, తెలివితక్కువ నిర్ణయంగా భావిస్తున్నాయి.. ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు" అని కోచ్కర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి "ఏకపక్ష" నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము చట్టపరంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గోవా యూనిట్ అధ్యక్షుడు అమిత్ పాలేకర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని "మూర్ఖపు నిర్ణయం"గా వ్యాఖ్యానించారు. 'మా తల్లి మహదేయిని కర్ణాటకకు అమ్మిన తర్వాత, బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం పొరుగువారిని ప్రసన్నం చేసుకునేందుకు నీచ స్థాయికి దిగజారిపోతోంది' అని ఆయన ఓ వీడియో సందేశంలో ఆరోపించారు.