కర్ణాటక : రేపటికి వాయిదాపడ్డ విశ్వాస పరీక్ష

కర్ణాటక : రేపటికి వాయిదాపడ్డ విశ్వాస పరీక్ష

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరపకుండానే సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ రమేశ్ కుమార్. దీంతో సభలోనే ఉండిపోయారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ సూచనను పరిగణలోనికి తీసుకోకుండా స్పీకర్ సభను వాయిదా వేశారని మండిపడుతున్నారు. రాత్రంతా సభలోనే ధర్నా చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.

అంతకుముందు అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. విశ్వాస పరీక్షపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. విశ్వాస పరీక్షపై చర్చను పొడిగించేలా కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నించగా.. చర్చను త్వరగా ముగించి ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ పట్టుబట్టింది. ఇరు పక్షాల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లుతోంది. విశ్వాస పరీక్షపై కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ వజుబాయ్ వాలాను కలిసింది. విశ్వాస పరీక్షపై ఇవాళే ఓటింగ్ జరిగేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని జగదీశ్ షెట్టర్ బృందం గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ కు ప్రత్యేక అధికారి ద్వారా లేఖ పంపారు  గవర్నర్. విశ్వాస పరీక్షపై ఇవాళ ఓటింగ్ ముగించాలని లేఖలో సూచించారు. గవర్నర్ పంపిన లేఖను సభలో చదివి వినిపించారు స్పీకర్.

అయితే  అసెంబ్లీ స్పీకర్ కు గవర్నర్ లేఖ రాయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు తప్పుబడుతున్నారు. విశ్వాస పరీక్షపై స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనలని వాదించాయి. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గవర్నర్ లేఖ రాయడంలో తప్పు లేదని చెప్పింది. అర్ధరాత్రి వరకైనా సరే.. ఇవాళ ఓటింగ్ జరపాలని బీజేఎల్పీ నేత యడ్యూరప్ప తేల్చి చెప్పారు.